రహదారులు రక్తసిక్తం

Multiple Road Accidents In Mahabubnagar - Sakshi

రాజాపూర్‌ (జడ్చర్ల) : టైర్‌ పంక్చర్‌ కావడంతో లారీని రోడ్డు పక్కన ఆపి మరమ్మతు చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో లారీ క్లీనర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున రాజాపూర్‌ శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సయ్య కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా రాజంపేట్‌ నుంచి లారీలో తమలపాకుల లోడ్‌ చేసుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా రాజాపూర్‌ శివారులో బ్రిడ్జిపై లారీ టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో లారీకి టైరు మార్చుకొని లారీకి అమర్చిన జాకీని క్లీనర్‌ జోగి కృష్ణ(32) తీస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో జాకీ తీస్తున్న క్లీనర్‌ కృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నర్సయ్య ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

అత్తారింటికి వస్తూ..  
పెబ్బేరు (కొత్తకోట): పీర్ల పండగ కోసం అత్తగారింటికి వస్తున్న ఓ అల్లుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని రంగాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బునాదిపూర్‌ గ్రామానికి చెందిన శారదకు ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన సతీష్‌(25)తో గత నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. అయితే బునాదిపూర్‌లో పీర్ల పండగ ఉండటంతో భార్య శారద ముందుగానే తల్లిగారింటికి వచ్చింది. శుక్రవారం సతీష్‌ తన ద్విచక్రవాహనంపై వస్తుండగా రంగాపూర్‌ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన బస్సు ఢీకొని సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఘటనతో ఇటు బునాదిపురంలో, అటు సతీష్‌ స్వగ్రామం మునగాలలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. 

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి 
కోస్గి (కొడంగల్‌): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. కోస్గిలోని సాయినగర్‌కు చెందిన పూసల కాళి(38) గురువారం సాయంత్రం తన వ్యాపారం ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. లారీ కాళి కాళ్లపై నుంచి వెళ్లడంతో విరిగిపోయి తీవ్రంగా గాయపడగా స్థానికులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి తర్వాత పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఘటనపై కాళి సోదరుడు పాపరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాళికి భార్య పెంటమ్మతోపాటు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు.  

ఎదురెదురుగా బైక్‌లు ఢీకొని.. 
వనపర్తి క్రైం: ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి పట్టణానికి చెందిన రవి(45) ద్విచక్రవాహనంపై సొంత పనులు నిమిత్తం పెబ్బేరు వైపు వెళ్లి వనపర్తికి తిరిగి వస్తున్నాడు. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన అబ్ధుల్లా, రాజులు వేర్వేరు ద్విచక్రవాహనాలపై వనపర్తి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా తిరుమలయ్య గుట్ట సమీపంలోని రేడియంట్‌ పాఠశాల దగ్గర ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రవికి తీవ్రగాయాలు కాగా అబ్ధుల్లా చేతికి, రాజు భుజానికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. రవి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రవికి భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. 

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు 
బాలానగర్‌ (జడ్చర్ల): ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని ఉడిత్యాల శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తు ల కథనం ప్రకారం.. నవాబుపేట్‌ నుంచి బాలానగర్‌ వైçపు వస్తున్న షాద్‌నగర్‌ డిపో ఆర్టీసీ బస్సు ఉడిత్యాల శివారులో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఉడిత్యాల నుంచి వీరన్నపల్లికి బైక్‌పై వెళ్తున్న పెద్దగొల్ల లింగంను ఢీకొట్టింది.  దీంతో తీవ్రంగా గాయపడిన లింగంను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. లింగం తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. 

కారు బోల్తా పడి.. 
మాగనూర్‌ (మక్తల్‌): కారు బోల్తా పడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని శక్తినగర్‌కు చెందిన మహేష్‌ కారులో శుక్రవారం మధ్యాహ్నం  మండలంలోని హిందుపూర్‌కు వస్తున్నాడు. అయితే టైరోడ్డు– హిందుపూర్‌ గ్రామాల మధ్యలో రోడ్డు నిర్మాణం కోసం కల్వర్టు తవ్వి మట్టిని రోడ్డుకు అడ్డంగా వేశారు. ఇక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు గాని, స్పీడ్‌ బ్రేకర్లు గాని లేకపోవడంతో వేగంగా వచ్చిన కారు అదుపు చేయలేక మట్టి దిబ్బపై నుంచి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహేష్‌ను రైచూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణా ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top