రెండేళ్ల కుమారుడితో తల్లి ఆత్మహత్య

Mother Commits Suicide With Son in Hyderabad - Sakshi

అత్తమామల వేధింపులే కారణం

కేసు నమోదు చేసిన ఎల్బీ నగర్‌  పోలీసులు

నాగోలు: అత్తమామల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన రెండేళ్ల బాబుతో కలిసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం  ప్రకారం.. నాగోల్‌ బండ్లగూడకు చెందిన తూర్పాటి దయాకర్‌–  పెద్ద ఎల్లమ్మ దంపతుల కుమారుడు తూర్పాటి రాజశేఖర్‌  నల్లకుంట అచ్చయ్యనగర్‌కు చెందిన నర్సింహ–చంద్రకళ దంపతుల కుమార్తె సుజాత (27)ను 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తండ్రి దయాకర్‌ ప్రభుత్వ ఉద్యోగి కాగా, రాజశేఖర్‌ ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్, సుజాతలకు  రెండేళ్ల కుమారుడు నైనీశ్‌ ఉన్నాడు. దయాకర్‌ పెద్ద కుమారుడు రాఘవేందర్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రాఘవేందర్‌ చేసిన అప్పులకు రాజశేఖర్‌ మధ్యవర్తిగా ఉండి చెక్‌ లు ఇచ్చాడు. చెక్స్‌ బౌన్స్‌ కావటంతో రుణదాతలు రాజశేఖర్‌పై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడసాగారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ భార్య సుజాత ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాల్సిందిగా అత్తమామలు ఒత్తిడి చేశారు. రాఘవేందర్‌ చేసిన అప్పులకు తన భర్తను బాధ్యుడిని చేయటం, తన బంగారాన్ని ఇవ్వమని అడగటంతో మనస్తాపం చెందిన సుజాత ఇల్లు ఖాళీ చేద్దామని భర్తతో  కొంతకాలంగా పోరుపెడుతోంది.

తాను ఇంట్లో  ఉండలేమని, మరో ప్రాంతంలో అద్దెకు తీసుకుందామని భర్తను అడుగుతూ వచ్చింది. త్వరలోనే ఖాళీ చేద్దామని ఆమెను సముదాయిస్తూ నాగోల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీలో ఒక ఇల్లు చూసినట్లు చెప్పాడు. ఆషాఢ మాసం వెళ్లిన తర్వాత ఖాళీ చేద్దామని చెప్పగా,  వెంటనే ఖాళీ చేద్దామని సుజాత భర్తతో గత రాత్రి మరోమారు గొడవ పడింది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటిని ఖాళీ చేయకుండా అడ్డుకుంటూ రాజశేఖర్‌ లేని సమయంలో కోడలు సుజాతను సూటిపోటు మాటలతో వేధించేవారు. అప్పుల వారి వేధింపులు, అత్తమామల సూటిపోటి మాటలు తట్టుకోలేక సుజాత మానసికంగా కృంగిపోయింది.  సోమవారం ఉదయం భర్త బయటకు వెళ్లగా, సుజాత భర్తకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నామని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. ఆందోళన చెందిన రాజశేఖర్‌ వెంటనే ఇంటికి వచ్చేసరికి  తలుపు గడియ పెట్టి ఉంది. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా,  భార్య సుజాత సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో కుమారుడు నైనీశ్‌ కు ఉరి వేసి తానూ ఉరేసుకొని తనువు చాలించింది. రాజశేఖర్, వారి కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి సుజాతను, నైనీశ్‌ను కిందకు దించి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. నల్లకుంటలో ఉన్న సుజాత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల్లీ కుమారుడు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. సుజాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీస్‌లుకేస్‌ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top