పసిమొగ్గలపై పశువాంఛ!

Molestations On Minor Girls In PSR Nellore - Sakshi

జిల్లాలో బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు

సన్నిహితులే అఘాయిత్యాలకు ఒడిగడుతున్న వైనం

ఇంటా..బయట కొరవడిన భద్రత

నెల్లూరు గాంధీగిరిజన కాలనీలో ఓ చిన్నారిపై కామాంధుడు లైంగికదాడి చేశాడు. నగరంలోని శెట్టిగుంటరోడ్డులో ఓ మానసిక వికలాంగురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుచ్చిరెడ్డిపాళెంలో ఎనిమిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడి. పొదలకూరులో ముక్కుపచ్చలారని ఓ చిన్నారిపై కామాంధుడి లైంగికదాడి యత్నం. పొర్లుకట్ట సుందరయ్య కాలనీలో 95 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాగుంటలేఅవుట్‌లో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  వాకాడు మండలం కొత్తచెరువులో కుమార్తెపై తండ్రే లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. కావలి పట్టణంలోని కొనదిన్నెలో ఓ బాలికను మేనమామ గర్భవతిని చేశాడు.  రక్తసంబంధీకులు,  తెలిసిన వారి పైశాచికత్వానికి బలైపోతున్న పసిపాపల ఉదంతాలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

 నెల్లూరు(క్రైమ్‌):  కామంతో కళ్లుమూసుకుపోయి ఆడపిల్లలపై సన్నిహితులే అఘాయిత్యాలకు ఒడిగట్టడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కన్నతండ్రే కామంతో కూతుళ్లను చిదిమేస్తున్న సంఘటనలు ఉన్నాయి. 

పరిచయస్తులే కామాంధులు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐదేళ్ల నుంచి పన్నెం డేళ్లలోపు చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని జాతీయ నేర రికార్డుల బ్యూరో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇందులో 30 శాతం మంది లైంగిక దాడులకు గురవుతుండగా 40 శాతం మందిపై లైంగికదాడి యత్నాలు జరిగాయని తే ల్చింది. చిన్నారులను లైంగికంగా వేధించిన వారి లో 90 శాతం మంది వారికి పరిచయస్తులేనని పేర్కొంది. భారత స్త్రీ,శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ 2007లో సర్వే చేసిన సమయంలో 53.22 శాతం బాలలు పలు రకాల లైంగిక వేధింపులకు గురవుతున్నారని తేలేంది. వీరిలో 21.8 శాతం బాలలు తీవ్ర అత్యాచారాలకు గురవుతున్నారని వెల్లడిం చింది. ఇందులో 50 శాతం అత్యాచారాలు నమ్మకస్తుల వల్లే జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనల పై బాలల రక్షణ, సంరక్షణ కోసం పనిచేయాల్సిన చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీల ప్రతినిధులు ఘటన జరిగిన తర్వాత హడావుడి చేసి సరిపెట్టుకొంటున్నారు. పోలీసు రికార్డుల పరంగా గడచిన ఐదు నెలల్లో సుమారు 32 కేసులు నమోదైనట్లు తెలిసింది.   

టెక్నాలజీతో పెడతోవ
నైతిక విలువలు, కట్టుబాట్లు లేని నడవడిక.. పర్యవేక్షణ కరువైన యువత పెడదారి పడుతున్నారు. ఇంటర్నెట్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక పరి స్థితి మరింత విషమంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి విషయాలకు వినియోగించుకుండా దుర్వినియోగం చేస్తున్నారు. పాఠశాలలో నే విద్యార్థులు మొబైల్‌ల్లో పార్న్‌ వీడియోలు చూ డడం సర్వసాధారణమైన అంశంగా మారింది.  

చట్టాలున్నా.. ఆగని దాడులు
బాలికల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను అమలులోకి తెచ్చినా దాడులు ఆగడం లేదు. చట్టాలకు జడవని కామాంధులు బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతూ వారి జీవితాలను కాలరాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2012 నవంబర్‌ 26వ తేదీన ప్రొటెక్సన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ (ఫోక్సో) చట్టాన్ని అమల్లోకి  తెచ్చింది. సాధారణ సెక్షన్ల మాదిరే ఉన్నా ఈ చట్టంలోని క్లాజ్‌లు చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టం కింద కేసు నమోదైతే 13 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. సామాన్య మానవులకన్నా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వారిపై మరింత ఎక్కుశిక్ష పడే అవకాశం ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. 18 ఏళ్ల లోపు బాలికలు లైంగిక వేధింపులకు గురైతే ఈ కేసులను ఫోక్సో చట్టం కింద నమోదు చేస్తారు. ఇంతటి కఠిన చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినా బాలికలపై నేటికి అఘాయిత్యాలు జరుగుతుండటం బాధాకరం.  

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
లైంగికదాడులు, వేధింపులు అదికమవతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై తల్లిదండ్రులు పిల్ల లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏ విషయానైనా తమతో పంచుకునేలా వారిని తీర్చిదిద్దాలి. వారితో అధిక సమయం గడపాలి. పదేళ్లలోపు పిల్లలను పాఠశాలలు, ట్యూషన్లకు పంపే సమయంలో పలు అంశాలను గమనించాలి. సాయంత్రం వారు పాఠశాల నుంచి ఇం టికి తిరిగొచ్చాక ఆడుకునే సమయంలో ఎక్కడిక్కెడకు వెళుతున్నారు? ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు? అనే విషయాలను గమనించాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనపుడు కుటుంబ సభ్యులకు, డయల్‌ 100కు ఫోను చేసే విధంగా శిక్షణ నివ్వాలని నిపుణులు పేర్కొంటున్నారు.

కఠిన చర్యలు తప్పవు
చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఫోక్సాయాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఈచట్టం కింద కేసులు నమోదైతే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఆడపిల్ల లు తమను తాము కాపాడుకొనేందుకు దోహదపడే ఆత్మరక్షణ విద్యలు, మెళుకువలను తల్లిదండ్రులు నేర్పించాలి. అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
– పి. శ్రీధర్, డీఎస్పీ,మహిళా పోలీస్‌స్టేషన్, నెల్లూరు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top