మహిళకు కరువైన రక్షణ

Molestation On Woman In Tirupati Chittoor - Sakshi

మొన్న మెడికో.. నిన్న టీటీడీ అటెండర్‌

నేడు న్యాయం కోసం వచ్చిన మహిళకు వేధింపులు

వెలుగుచూడని లైంగిక వేధింపులు ఎన్నెన్నో

సాక్షి, చిత్తూరు, తిరుపతి : మహిళాభ్యున్నతే లక్ష్యం.. మహిళల రక్షణే ప్రభుత్వ లక్ష్యం అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మొన్న మెడికో విద్యార్థిని శిల్ప అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మరువక ముందే టీటీడీ ఏఈఓగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ శ్రీనివాసమంగాపురంలో మహిళా అటెండర్‌గా పనిచేస్తున్న మహిళ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న విషయం వెలుగుచూసింది. ఎనిమిది నెలలుగా జరుగుతున్న వేధింపుల గురించి ఏఈవో శ్రీనివాసులుపై టీటీడీ జేఈవోకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆమె చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు కానివ్వకుండా అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మీడియాకు తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేయకతప్పలేదు. ఆ వెంటనే ఏఈవో బెయిల్‌ మంజూరు చేసుకున్నారు. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదేవిధంగా విష్ణు నివాసంలో ఓ కాంట్రాక్టర్‌కు అనుచరుడుగా ఉన్న రామారావు అనే వ్యక్తి తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్‌ పలుకుబడి ఉపయోగించి మహిళా కార్మికులపైనే ఎదురు కేసు నమోదు చేయించారు. ఓ వైపు మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పుకుంటూనే.. మరో వైపు కీచకులకు అధికార పార్టీ నేతలే అండగా నిలబడతుండడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   

వెలుగుచూడని వేధింపులెన్నో
న్యాయం కోసం ఆశ్రయించిన మహిళపై వాయల్పాడు సీఐ తేజోమూర్తి అత్యాచార యత్నానికి పాల్పడడం, ఆ తరువాత లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా సీఐ లైంగిక వేధింపుల విషయాన్ని ఆ మహిళ బయటపెట్టకపోవడానికి తేజోమూర్తి పోలీసు అధికారి కావడమే. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతో ఆమె బయపెట్టలేదని తెలిసింది. వేధింపులు తీవ్రం కావడంతో మీడియా దృష్టికి తీసుకురాక తప్పలేదు. అంతేగాక జిల్లాలో చాలాచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.బయటపెడితే పరువు పోతుందని, కుటుంబ సభ్యులు ఉద్యోగాలు మాన్పించేస్తారనే ఉద్దేశంతో చాలామంది మహిళలు లోలోన కుమిలిపోతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను బయటపెట్టలేక, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం రక్షణ కల్పించపోతే మహిళలంతా ఏకమై ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top