పాపం పసిమొగ్గలు

Molestation on Children in Hyderabad - Sakshi

చిన్నారులే టార్గెట్‌గా ఘాతుకాలు

గంజాయి, వైట్నర్‌ మత్తులో లైంగిక దాడులు

ఆపై దారుణ హత్యలు  

చాంద్రాయణగుట్ట: పక్కింటి వారికి భారీగా డబ్బులు వచ్చాయా.? పొరుగింట్లో ఉండే వారితో పాత గొడవలు ఉన్నాయా.?  టీవీ సీరియల్‌లో తరహాలో కిడ్నాప్‌లకు ప్లాన్‌ చేద్దామా...? లేదా చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం...ఇలా కారణమేదైనా సరే చిన్నారులనే టార్గెట్‌గా   చేసుకొని కిడ్నాప్, లైంగికదాడులు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు పాతబస్తీ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పక్క పక్క ఇళ్లల్లో ఉంటూ చిన్నారులతో సన్నిహితంగా ఉండేవారే ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతుండటంతో ఎవరిని నమ్మాలో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. చెడు వ్యసనాలకు బానిసైన కొందరు యువకులు మృగాళ్ల వ్యవహరిస్తూ చిన్నారుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గంజాయి, వైట్‌నర్‌ మత్తులో పసిమొగ్గలను చిదిమేస్తున్నారు. పిల్లలతో తమకున్న పరిచయాన్నే పెట్టుబడిగా చాక్లెట్, బిస్కట్‌ల ఆశ చూసి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయం బయటికి తెలుస్తుందనే భయంతో కర్కశంగా హతమారుస్తున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో చిన్నారుల తల్లిదండ్రులను కలవరపాటుకు లోనవుతున్నారు. తాజాగా బాలాపూర్‌ ఠాణా పరిధిలో బుధవారం రాత్రి దుకాణానికి వెళ్లిన బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా కిరాతకంగా హత్య చేసిన సంఘటన చిన్నారుల భద్రతను ప్రశ్నార్థంగా మార్చింది.

తల్లిదండ్రుల పర్యవేక్షణలేకే..
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందునే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దారుణాలకు పాల్పడుతున్న యువకులతో పాటు బాధితులైన చిన్నారుల విషయంలో కూడా తల్లిదండ్రుల ఉదాసీనతే కారణంగా తెలుస్తోంది. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను తల్లిదండ్రులు గంటల తరబడి పట్టించుకోకపోవడం కూడా ఈ ఘటనలకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. 

గంజాయి మత్తులో చిత్తు..  
ఇటీవల నగరంలో మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 15 ఏళ్ల వయసులోనే మద్యం సేవించడం, గంజాయి, వైట్‌నర్‌ తదితర మత్తు పదార్థాలకు బానిసై ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. బర్త్‌ డే ఫంక్షన్ల పేరుతో బస్తీల్లో హంగామా చేస్తూ దాడులు, ప్రతి దాడులు,  హత్యలకు కూడా తెగబడుతున్నారు.

క్షేమంగా బయటపడినచిన్నారులు వీరే..
2013 నవంబర్‌ 11న పాతబస్తీ రికాబ్‌గంజ్‌కు చెందిన బంగారు వ్యాపారి గోపాల్‌ మాజీ కుమారుడు ఆకాష్‌ (2.5)ను దుకాణంలో పనిచేసే దూరపు బంధువైన రాంప్రసాద్‌ మిస్ట్రీ(26) కిడ్నాప్‌ చేశాడు. మూడు కిలోల బంగారం కావాలంటూ పది రోజుల పాటు డిమాండ్‌ చేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని రక్షించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  
2010 ఫిబ్రవరి 8న శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాజీపురాలో మహ్మద్‌ హమీద్‌ ఖాన్‌ కుమారుడు నూరుల్లా(4.5)ను అతడి బంధువులు  కిడ్నాప్‌ చేసి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. పోలీసులు నిందితులు సయ్యద్‌ రాషెద్, మహ్మద్‌ ఫయీం షాను పోలీసులు అరెస్ట్‌ చేసి బాలుడికి విముక్తి కల్పించారు.     

పాతబస్తీలోచోటు చేసుకున్న ఘటనల్లో కొన్ని...
ఈ నెల 8న రాత్రి జల్‌పల్లిలోని వాదే ముస్తఫా బస్తీలో కూల్‌డ్రింక్‌ కోసం వెళ్లిన ఏడేళ్ల బాలుడిపై గుర్తు తెలియని యువకుడు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు.  
2017 జూన్‌ 28న రంజాన్‌ పండుగ సందర్భంగా బార్కాస్‌ బజార్‌లో ఆడుకునేందుకు వెళ్లిన మహ్మద్‌ ఖాన్‌(10)కు అతడి పక్కింట్లో ఉండే యువకుడు చాక్లెట్‌ ఆశగా చూపి బార్కాస్‌ ప్రభుత్వ పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. వారం రోజుల తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది. కాగా సదరు యువకుడు ఇదే తరహాలో 15 మంది బాలలపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

కిడ్నాప్‌లు..హత్యలు  
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధి లో 2017 మార్చి 28న నమాజ్‌కు వెళ్లిన రఫి(7)ని  పక్కింటి యువకుడు మునీర్‌ ఓ టీవీ చానల్‌లో వస్తున్న క్రైం పెట్రోల్‌ సీరియల్‌ను అనుసరించి దారుణంగా హత్య చేశాడు. ‘మా నాన్న ఫలక్‌నుమాలో ప్లాటు అమ్మాడని...రూ. కోటి వచ్చాయని చెప్పిన పాపానికి ఆ బాలుడిని...కిడ్నాప్‌ చేసి ఆ డబ్బులు డిమాండ్‌ చేయాలని హత్య చేశాడు.   
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2014 సెప్టెంబర్‌ 22న ప్రభాకర్, ఉమారాణి దంపతుల కుమారుడు కరుణాకర్‌(10)ను అదే ప్రాంతానికి చెందిన మల్లిఖార్జున్, మోహన్‌ కిడ్నాప్‌ చేసి అదేరోజు దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం 10 రోజుల పాటు రూ. 2 లక్షలు కావాలని డిమాండ్‌ చేస్తూ అతడి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టారు.  
ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2014 ఏప్రిల్‌ 5న జంగమ్మెట్‌ ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలోని ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు  కార్తీక్‌ (10)ను అతడి బంధువైన శివకుమర్‌ కిడ్నాప్‌ చేసి రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. తల్లిదండ్రులు స్పందించే లోపే  షాద్‌నగర్‌లో బాలుడిని బండరాయితో మోది హత్య చేశాడు.  
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2010 డిసెంబర్‌ నెలలో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి సదరు ఏజెంట్‌ కుమారుడిని కిడ్నాప్‌ చేసి బీచ్‌పల్లి  వద్ద దారుణంగా హత్య చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top