తల్లి ఒడికి చిన్నారి

Missing Child Return to Mother In Guntur - Sakshi

15 గంటలపాటు ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు.. కంటిపై కునుకు లేదు.. కళ్లలో నీటి ధార ఆగ లేదు. గుండెల్లో ఆందోళన తగ్గ లేదు. కిలకిల నవ్వులతో చెంగు చెంగున ఆటలాడే కన్న బిడ్డ కనిపించకుండా పోయింది. కనిపించిన ప్రతి ఒక్కరినీ రెండు చేతులు జోడించి బిడ్డ గురించి ఆరా తీశారు.. ఆచూకీ లేదు. ఇక పోలీసుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. 15 గంటలపాటు జల్లెడ పట్టారు. అప్పటికే తప్పిపోయిన చిన్నారిని.. గుండెల నిండా మానవత్వం నింపుకున్న ఓ తల్లి దగ్గరకు తీసింది. పాపను లాలించి బుజ్జగించి ఏడుపు మాన్పించింది. ఇక పోలీసుల చెంతకు చేరుద్దామకునేంతలోగా.. వారే పాప గురించి వెతుకుతున్నట్లు తెలుసుకుని హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చిన్నారిని పోలీసులకు అప్పగించి కన్న పేగుకు ఊపిరి పోసింది. చిన్నారిని చూసేసరికి.. ప్రాణం లేచివచ్చిన తల్లిదండ్రుల కళ్లలో నీటి ఊట జలజలారాలింది.. ఈసారి పట్టరాని ఆనందంతో.. గుంటూరులో శుక్రవారం తప్పిపోయిన చిన్నారి శనివారం తల్లిదండ్రుల ఒడికి చేరింది.  

పట్నంబజారు(గుంటూరు): ఇంటి వద్ద ఆడుకుంటూ ఓ చిన్నారి రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. అయ్యో బిడ్డ ఏడుస్తుందని ఓ మహిళ దగ్గరకు తీసుకుంది. చుట్టు పక్కల వారిని విచారించినా ఫలితం లేకపోవడంతో తనతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. రెండో రోజు పోలీసులు పాప కోసం వెతకడం గమనించి తన వద్ద ఉందని చెప్పి ఆ తల్లిదండ్రులకు అప్పగించి మానవత్వం చాటిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని వసంతరాయపురంలో నివాసం ఉండే బొలిశెట్టి రాజనారాయణ, అరుణ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమార్తె  సహస్ర (సిరి) గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటోంది. దీంతో పనుల నిమిత్తం తండ్రి బయటకు వెళ్లాడు. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఇంటి వద్ద ఆడుకుంటూ చిన్నారి రోడ్డు మీదకు వచ్చింది. అక్కడ నుంచి శారదాకాలనీలో 31వ లైను వద్ద ఉన్న ఒక కల్యాణ మండపం వద్దకు చేరింది.

ఆ తర్వాత ఎటు వెళ్లాలో తెలియక, తల్లి కనిపించక ఏడవడం మొదలుపెట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న 25వ లైనుకు చెందిన ఏసమ్మ అనే మహిళ చిన్నారిని దగ్గరకు తీసుకుంది. ఆ పరిసర ప్రాంతాల్లో బిడ్డ గురించి విచారించినా ఫలితం లేకపోవడంతో తన ఇంటికి తీసుకెళ్లింది. కుమార్తె మేరికి చిన్నారి సిరిని అప్పగించింది. మేరికి కూడా అదే వయస్సు ఉన్న చిన్నారులు ఉండడంతో వారితో ఆడుకుంటూ ఏడుపు మానేసింది. దీంతో చిన్నారిని మేరికి ఇచ్చి పెదకాకాని మండలం వెనిగండ్లలో ఉండే వారి ఇంటికి పంపించింది. అయితే ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు సాయంత్ర వరకు వెతికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో వై.శ్రీనివాసరావు వెంటనే స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. చిన్నారి తప్పిపోయిందా..లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి వరకు ఆచూకీ లేకపోవడంతో శుక్రవారం ఉదయం తిరిగి వెతుకులాట ప్రారంభించారు. శారదా కాలనీలో వీరిని గమనించిన ఏసమ్మ తన వద్ద చిన్నారి ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తామే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే పనిలో ఉన్నామని ఏమమ్మ తెలియజేశారు. తన బిడ్డను క్షేమంగా కాపాడిన ఏసమ్మ, ఆమె కుమార్తె మేరికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ పి.సౌమ్యలత ఏసమ్మ కుటుంబ సభ్యులను అభినందించారు.

అర్బన్‌ ఎస్పీ అభినందన
చిన్నారిని క్షేమంగా తీసుకు రావడంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పనితీరును అర్బన్‌ ఎస్పీ సిహెచ్‌.విజయారావు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో అభినందించారు. తన వద్దకు తీసుకొచ్చిన చిన్నారితో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారిని వెతికిపట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన వెస్ట్‌ డీఎస్పీ పి.సౌమ్యలత, అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ వై.శ్రీని వాసరావును అభినందించారు. అనంతరం అధి కారులు, సిబ్బందికి క్యాష్‌రివార్డులు అందజేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top