దొరసానిపల్లెలో వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide in YSR kadapa - Sakshi

భర్తే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ

సరస్వతి మృతిపై ఎన్నో అనుమానాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెలో ఉలసాల సరస్వతి (31) అనే వివాహిత సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె పుట్టింటి వాళ్లు మాత్రం భర్తనే తమ కుమార్తెను చంపాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు మైలవరం మండలం, దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన చౌడం నారాయణ, వెంకటసుబ్బులు దంపతులకు నలుగురు  కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో సరస్వతి మూడో సంతానం. ఆమెకు ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన రాజశేఖర్‌తో 9 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ. 25 వేలు నగదు, 5 తులాల బంగారు కట్నకానుకల  కింద ఇచ్చారు. వారికి 8 ఏళ్ల జగదీష్‌ అనే కుమారుడు ఉన్నాడు.

నాలుగేళ్ల నుంచి పుట్టింటికి పంపలేదు
రాజశేఖర్‌ తన భార్యను నిత్యం వేధించేవాడు. ఇతరులతో మాట్లాడితే అనుమానించి చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ కారణం చేతనే నాలుగేళ్ల నుంచి అతను భార్యను పుట్టింటికి పంపలేదు. తమ కుమార్తెను పిలుచుకొని వెళ్లాలని వచ్చిన పుట్టింటి వాళ్లను  దుర్భాష లాడేవాడు. పుట్టింటికి ఫోన్‌ చేసినా అతను ఓర్చుకునేవాడు కాదు. భర్త ప్రవర్తనతో విసుగెత్తిన ఆమె తల్లిదండ్రులను పూర్తిగా దూరం చేసుకోవాల్సి వచ్చింది.

సరస్వతి చనిపోయిన  సమాచారం తెలుపలేదు
‘దొరసానిపల్లెలో ఉంటున్న మీ చెల్లెలు సరస్వతి చనిపోయిందని చెప్పుకుంటున్నారు.. మీకు తెలియదా ’ అని స్థానికులు ఆమె అన్నకు ఫోన్‌ చేశారు. దీంతో ఆమె నలుగురు సోదరులు, తల్లి హుటాహుటిన దొరసానిపల్లెకు చేరుకున్నారు. అయితే  వారు వచ్చేసరికి సరస్వతి మృతదేహం కింద ఉండగా, ఫ్యాన్‌కు చీర వేలాడుతోంది. మృతదేహం పక్కనే రక్తపు మరకలు, గాజులు పడి ఉన్నాయి. ఆమె మృతదేహాన్ని చూసి తల్లి వెంకటసుబ్బులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బయట ఏదో గొడవ జరిగిందని దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకొని ఉరి వేసుకున్నట్లు రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం రావడంతో రూరల్‌ ఎస్‌ఐ మంజునాథరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. సరస్వతి సోదరుడు మనోహర్‌ ఫిర్యాదు మేరకు భర్త రాజశేఖర్, అత్త సుబ్బలక్షుమ్మ, మరది రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మా కుమార్తెను చంపేశారు..
పెళ్లైన నాటి నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారని మృతురాలి తల్లి వెంకటసుబ్బులు రోదించసాగింది. నాలుగేళ్ల నుంచి మా పాపను ఇంటికి పంపకుండా దూరం చేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది. కాగా సరస్వతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఇంట్లో గడియపెట్టుకొని ఉరి వేసుకున్న వెంటనే మిద్దెపైన  ఉన్న గవాచి నుంచి దిగానని, ఉరి నుంచి ఆమెను దించినట్లు భర్త రాజశేఖర్‌ చెప్పడాన్ని ఎవ్వరూ విశ్వసించలేదు. గవాచి నుంచి దిగడం సాధ్యం కాదని స్థానికులే చెబుతున్నారు. అంతేగాక ఉరికి వేలాడుతున్న సరస్వతిని తానొక్కడినే  కిందికి దించానని  చెబుతున్న భర్త మాటలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top