యువకుడికి వివాహిత వేధింపులు,ఫిర్యాదు

Married woman booked for harassing Youth - Sakshi

సీన్‌ రివర్స్‌! 

వివాహితతో యువకుడి ప్రేమాయణం 

కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న వైనం 

సైబర్‌ వేధింపులకు పాల్పడుతున్న మహిళ 

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడు ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: యువతుల వెంట పడుతూ ప్రేమ పేరుతో వేధించడం.. వారు కాదంటే కక్షగట్టి ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడం.. ఆనక సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లడం.. ఈ తరహా కేసుల్ని తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రివర్స్‌ సీన్‌తో కూడిన ఫిర్యాదు అందింది. వివాహిత వేధింపుల బారిన పడిన ఓ యువకుడు ఆమెపై చర్యలు కోరుతూ సైబర్‌ ఠాణాను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎంబీఏ పూర్తి చేశాడు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన అతడు అమీర్‌పేటలోని ఓ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేశాడు. ఆ సమీపంలోని మరో ప్రాంతంలో నివసిస్తుండేవాడు. అక్కడే ఓ వివాహిత భర్త నుంచి వేరుపడి తన పిల్లలతో కలిసి ఉంటోంది. ఒకే ప్రాంతంలో ఉండే వారు కావడంతో వీరిద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు ఆ యువకుడిని ఆహ్వానించింది. అలా ఆమె ఇంటికి వెళ్లిన అతగాడు ఆ తర్వాత రాకపోకలు సాగించాడు. ఇద్దరి మధ్యా పరిచయం పెరగడంతో పాటు సన్నిహితంగా మారారు. ఓ దశలో మనస్పర్థలు రావడంతో సదరు యువకుడు ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. 

అప్పటి నుంచి యువకుడిపై కక్షగట్టిన ఆమె సైబర్‌ వేధింపులు ప్రారంభించింది. ఆ యువకుడి ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేయడంతో పాటు అతడి పేరుతో మరో నకిలీ ఖాతాను సృష్టించింది. వీటిని వినియోగించి కొన్ని పోస్టులు పెట్టడం, వాటిలో ఉన్న అతడి ఫొటోలతో పాటు బంధులవీ వివిధ సైట్స్‌లో పోస్ట్‌ చేయించేది. ఈ యువకుడి సమీప బంధువు ఫొటోలు మరో సోషల్‌మీడియా యాప్‌లో హల్‌చల్‌ కావడంతో వారు.. అది యువకుడి పనిగానే భావించి మెదక్‌ జిల్లాలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దీంతో యువకుడికి... వివాహితపై అనుమానం వచ్చి నిలదీయగా... తన వద్దకు రావాలని, గతంలో మాదిరిగా కలిసి ఉండాలని కోరింది. అలా చేస్తేనే ఫేస్‌బుక్‌ ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్స్‌ చెబుతానని షరతులు విధించింది. దీంతో సదరు యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top