వృద్ధుడికి డేటింగ్‌ వెబ్‌సైట్‌ టోకరా

Married Man Signs Up On Fraud Dating Website - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పదవీవిరమణ తర్వాత కుటుంబంతో హాయిగా గడపాలనుకుంటారు. అయితే మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో ఓ వృద్ధుడు డేటింగ్‌ వెబ్‌సైట్‌ మోసంలో రూ 46 లక్షలు పోగొట్టుకున్నారు. ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ రిటైర్‌ అయన 65 ఏళ్ల వృద్ధుడు 2018 మేలో ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయ్యాడు.

వెబ్‌సైట్‌లో నమోదైన తర్వాత ఆయన మీరా అనే మహిళ నుంచి ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నారు. డేటింగ్‌ సైట్‌లో ప్రీమియం మెంబర్‌గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని బాధితుడిని ఆమె కోరారు. ప్రీమియం మెంబర్‌గా రిజిస్టర్‌ అయిన తర్వాత ఆయనకు ముగ్గురు మహిళల ఫోటోలను పంపారు. వారిలో ఒక మహిళతో డేటింగ్‌కు ఆయన అంగీకరించగా, ఆమెతో ఏడాది పాటు డేటింగ్‌ చేసేందుకు రూ పది లక్షలు చెల్లించాలని మీరా అనే మహిళ బాధితుడితో వీడియో కాల్స్‌లో కోరింది. ఆ తర్వాత బీమా, పోలీస్‌ వెరిఫికేషన్‌ అంటూ బాధితుడి నుంచి పలుమార్లు పెద్దమొత్తంలో ఆమె వసూలు చేసింది.

అప్పటికే మీరాకు రూ 30 లక్షలు ముట్టచెప్పడంతో చివరికి ఆయన ఎంపిక చేసుకున్న మహిళ ఫోన్‌ నెంబర్‌ను అందచేసింది. ఈ మహిళ తనను రోజీ అగర్వాల్‌గా బాధితుడికి పరిచయం చేసుకుంది. రోజీ సైతం ఏవో సాకులతో సదరు వృద్ధుడి నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసింది. భారీగా నగదు చెల్లించినా డేటింగ్‌కు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం కలిగిన బాధితుడు తాను రిజిస్టర్‌ చేసుకున్న వెబ్‌సైట్‌ను పరిశీలించగా యూజర్‌ రివ్యూల్లో ఇది మోసపూరిత వెబ్‌సైట్‌ అనే కామెంట్‌ చూడటంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే మీరాకు ఫోన్‌ చేసి తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరగా, బాధితుడు చెల్లించిన రూ 46.25 లక్షలను ఈ ఏడాది జనవరి నాటికి చెల్లిస్తానని ఆమె హామీ ఇచ్చింది.

డబ్బు తిరిగి ఇస్తానని చెప్పిన తర్వాత ఆమె ఆ తర్వాత బాధితుడి కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోలేదు. మరోవైపు తాను మోసపోయినట్టు వెల్లడైనా పరువు పోతుందనే భయంతో ఈ ఏడాది మార్చి వరకూ ఆయన కుటుంబ సభ్యులకు విషయం తెలపలేదు. రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చిన సొమ్ము మొత్తం డేటింగ్‌ వెబ్‌సైట్‌ మోసానికి ఆవిరి కావడంతో ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఎదుట నోరుమెదిపాడు. డేటింగ్‌ వెబ్‌సైట్‌పై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top