మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడి దారుణహత్య

Man Murdered In Karimnagar - Sakshi

కరీంనగర్‌ క్రైం/కరీంనగర్‌రూరల్‌ : 15 ఏళ్లుగా సాగుతున్న చేపల చెరువు పంచాయితీ వివాదం హత్యకు దారి తీసింది. ఓ వర్గంలో దాడిలో మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు ప్రాణాలో కోల్పోయాడు. ఈ సంఘటన కరీంనగర్‌ మండలం చామన్‌పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..శుక్రవారం సాయంత్రం 4గంటలకు గ్రామంలోని అప్పన్నచెరువులో నీరు తగ్గడంతో చేపలు పరిశీలించేందుకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి (43) అక్కడికి చేరుకున్నాడు. దీన్ని గుర్తించిన ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చామనపల్లిలో రాజసముద్రం, అప్పన్న అనే పేర్లతో రెండు చెరువులున్నాయి. చామనపల్లి గ్రామానికి చెందిన చేపలు పట్టే సామాజిక వర్గానికి చెందిన వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో చామనపల్లికి చెందిన మత్స్య పారిశ్రామిక సంఘానికి చెందిన  కొంతమందిని సంఘం నుంచి బహిష్కరించారు.

దీంతో రెండువర్గాలు విడిపోయారు. చామనపల్లికి చెందిన  మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతికి, ఇతర కార్యవర్గసభ్యులకు రాజసముద్రం చెరువులో చేపలపెంపకంపై దాదాపు 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. సంఘం అధ్యక్షుడు తిరుపతి చేపలను పట్టుకుని విక్రయించి, సంఘానికి డబ్బులివ్వడంలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘం లెక్కలన్నింటిని అధికారులు, సభ్యుల సమక్షంలో వివరించారని అధ్యక్షుడు తిరుపతి వాదిస్తున్నాడు. చేపలను పట్టుకునే వ్యవహారంలో తిరుపతికి వ్యతిరేకంగా మరికొందరు సభ్యులు ఏకంకావడంతో రెండువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌లో రెండువర్గాలపై పలు కేసులు నమోదు కాగా హైకోర్టులోనూ కేసులు వేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిదులు రెండు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఎన్నో కౌన్సెలింగ్‌ చేసినా కొలిక్కి రాలేదు.  అధికారులతోపాటు స్ధానిక ప్రజాప్రతినిధులపై బొజ్జ తిరుపతి హైకోర్టులో కేసులు వేయడం మరింత వివాదానికి దారి తీసింది.

ముదిరిన వివాదం..
కేసులు నడుస్తున్న క్రమంలో తిరుపతి 2018 మార్చిలో హైకోర్టు నుంచి రాజసముద్రం చెరువులో చేపలను పట్టేందుకు అనుమతి తీసుకున్నాడు. ఇరువర్గాల నడుమ గొడవ జరిగే అవకాశముందని, పోలీస్‌ రక్షణ కల్పించాలనే హైకోర్టు ఆదేశాలతో రూరల్‌ ఏసీపీ ఉషారాణి, సీఐ శశీధర్‌రెడ్డి పోలీస్‌ బందోబస్తు కల్పించగా తిరుపతి చేపలు పట్టుకున్నాడు. అప్పట్లోనే రాజసముద్రం చెరువు తమ సంఘానికి చెందిందని, మరో సంఘానికి అప్పన్నచెరువును అప్పగించడంతో వివాదం ముగిసిందని తిరుపతి పేర్కొన్నప్పటికీ ఇరువర్గాల నడుమ వివాదం సద్దుమణగలేదు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు మరోవ్యక్తితో కలిసి బొజ్జ తిరుపతి అప్పన్నచెరువులో నీరు తగ్గడంతో చేపలను పరిశీలించేందుకు వెళ్లాడు. తిరుపతి రాక విషయం తెలుసుకున్న ప్రత్యర్థివర్గానికి చెందిన పలువురు మత్స్యకారులు అప్పన్నచెరువు వద్దకు చేరుకుని తిరుపతితో వాగ్వాదానికి దిగారు. వివాదం తారాస్ధాయికి చేరడంతో తిరుపతిపై ఆగ్రహంతో రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో సుమారు 10 నుంచి 15 మంది వరకూ పాల్గొని ఉంటారని ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్‌ రూరల్‌ సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
చేపల చెరువు వివాదంలో చామనపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి హత్య జరిగిన సంఘటన స్థలాన్ని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి, రూరల్‌ ఏసీపీ ఉషారాణి పరిశీలించారు. హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీ అధికారులను ఆదేశించారు.

చామనపల్లిలో పికెటింగ్‌
కరీంనగర్‌ క్రైం: చామనపల్లి చేపల చెరువుల వివాదంలో మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు బోజ్జ తిరుపతిని ప్రత్యర్ధి వర్గం రాళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చడంతో పోలీసులు గ్రామంలో పికె టింగ్‌ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top