అయ్యో..దేవుడా !

కొత్త అచ్చెర్ల వద్ద లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

భార్య,కుమారుడికి గాయాలు

అరసవల్లిలో తలనీలాలు సమర్పించి వస్తుండగా ప్రమాదం

అంతవరకు ఆనందడోలికల్లో తేలియాడిన ఆ కుటుంబం అంతలోనే అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఇసుకలారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం కారణంగా ఆ కుటుంబం పెద్ద దుర్మరణం చెందాడు.  అతని భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.   

కశింకోట(అనకాపల్లి): మండలంలోని అచ్చెర్ల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే  మృతి చెందగా, అతని భార్య,   కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డాడు. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన మంతిన గోపి (28) జిల్లాలోని బుచ్చియ్యపేట మండలం తురకలపూడి గ్రామంలో తన అత్తవారింటికి గురువారం భార్యా పిల్లలతోపాటు వచ్చాడు. అక్కడ రాత్రి ఉండిపోయారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణ మూర్తి దేవాలయంలో పెద్ద కుమారుడు తేజయశ్వంత్‌ తలనీలాలు సమర్పించేందుకు శుక్రవారం ఉదయం బయలుదేరారు. అక్కడి నుంచి రాత్రి మళ్లీ అత్తవారింటికి చేరుకున్నారు. శనివారం ఉదయం  తుని వెళ్లేందుకు మోటారు సైకిల్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. మండలంలోని కొత్త అచ్చెర్ల వద్ద అదే మార్గంలో వేగంగా వస్తున్న ఇసుక  లారీ వెనుక నుంచి ఢీకొంది.

కింద పడిపోయిన  గోíపీపై నుంచి లారీ వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మి అలియాస్‌ కుమారి (25), చిన్న కుమారుడు గిరి శరణం (7 నెలలు) గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.   విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.  పెద్ద కుమారుడు  తేజ యశ్వం త్‌(3) ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సీఐ జె.రామచంద్రరావు,  ఎస్‌ఐ బి.మధుసూదనరావు ప్రమాద స్థలాన్ని సందర్శించి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు  ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. గోపీ మృతి చెందడంతో తమకు దిక్కెవరి  తల్లి రమణ మ్మ, అతని అత్త దేవుళ్లు గుండెలవిసేలా రోదించారు. మృతుని కుటుంబానికి పరిహారం కోసం చాలా సేపు సంఘటనా స్థలంలో తర్జన భర్జనలు పడా ్డరు.   న్యాయమైన  పరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని బంధువులు భీష్మించారు.   టీడీపీ నాయకులు జోక్యం చేసుకొని  మధ్యవర్తిత్వం నెరిపారు.  చివరికి రూ.1.70 లక్షలు ఇవ్వడానికి లారీ యజమాని అంగీకరించినట్టు సమాచారం.

లైసెన్స్‌ లేకుండా  డ్రైవింగ్‌
లారీ నడిపిన వ్యక్తికి లైసెన్స్‌ లేదని స్థానికులు తెలిపారు. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి  మండలంలోని జి.భీమవరం శివారు  సింగవరం గ్రామానికి చెందిన వాడని  సమాచారం.  ప్రమాదం జరిగినప్పుడు మోటారుసైకిల్‌పై వెనుక కూర్చున్న గోపీ భార్య లక్ష్మి   ఆగమని లారీ డ్రైవర్‌కు సైగలు చేసినా ఆగకుండా వేగంగా వచ్చి ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. లారీ ముందు నంబర్‌ను   తొలగించి తప్పించుకోవాలని ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నట్టు  సమాచారం.

యథేచ్ఛగా ఇసుక రవాణా
బుచ్చియ్యపేట మండలం పెదమదినా ప్రాం తంలోని ప్రైవేటు భూముల  నుంచి మూడు నెలలుగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అసలే ఇరుకు రోడ్డు. ఒక వాహనం మాత్రమే తప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోడ్డులో రోజుకు సుమారు 200 వరకు లారీలు తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి యలమంచిలి, గాజువాక, విశాఖ తదితర  ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు.  ఈ విషయమై అధికారులకు   ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా  తక్షణమే ఇసుక రవాణాకు అడ్డుకట్టవేయాలని వారు కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top