ఎంబీఏ ప్రియురాలి కోసం దొంగతనాలు

Man Became Thief For MBA Lover - Sakshi

అమీర్‌పేట : జల్సాలకు అలవాటు పడడంతో పాటు తన ప్రియురాలి అవసరాలు తీర్చేందుకు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  పశ్చిమ మండలం డీసీపీ పంజగుట్ట ఏసీపీ తిరుపతన్నతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సుల్తాన్‌ బజార్, చౌదరీబాగ్, బడిచౌడికి చెందిన 27 ఏళ్ల ఘనశ్యాం బల్వీర్‌సింగ్‌ అలియాస్‌ బల్లు  సంపన్న కుటుంబంలో పుట్టాడు. కాచిగూడలోని భద్రుకా కాలేజీలో గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఈ సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆమె పూణేలో ఏంబీఏ చేస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ బల్వీర్‌కు ప్రియురాలు కూడా తోడు కావడంతో అవసరాలకు కావలసిన డబ్బు కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు.  

మధ్యాహ్న సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని రాత్రి సమయంలో వెళ్లి  ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను మాత్రమే దొంగిలిస్తాడు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులో కొంత ప్రియురాలికి పంపించి మిగతా డబ్బులు తాను ఖర్చుచేసేవాడు. దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన ప్రతిసారి తాను మారుతానని చెప్పి తిరిగి బయటకు వచ్చి ఎప్పటిలాగే దొంగతనాలు చేసేవాడు.దీంతో రెండు పరాయ్యాలు బల్వీర్‌పై పీడీయాక్ట్‌ కేసు నమోదు చేయగా 2017లో కేపీహెచ్‌బీ పోలీసులు అతడిపై  పీడీయాక్ట్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుండి వచ్చిన బల్వీర్‌ ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ పరిధిలో 3 ఇళ్లతో పాటు రాయదుర్గంలో 1,పేట్‌ బషీరాబాద్‌లో మరో దొంగతనం చేశాడు. తప్పించుకుని తిరుగుతున్న బల్వీర్‌ను ఎస్‌ఆర్‌నగర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల విలువచేసే 500 గ్రాముల బంగారం, తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే ఇనుపరాడ్,యాక్టీవా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు.నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులను అందజేశారు.

నెలకు రూ.3 లక్షల అద్దెలు  
సుల్తాన్‌ బజార్‌కు చెందిన రమేష్‌సింగ్‌కు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరు ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరప డ్డారు. బల్వీర్‌సింగ్‌ ఒక్కడే జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాడు పడ్డాడని పోలీసులు తెలిపారు. బల్వీందర్‌ కుటుంబానికి నెలకు రూ.3 లక్షలు అద్దెల రూపంలో డబ్బులు వస్తాయన్నారు. పోలీసులకు పట్టుపడ్డ ప్రతిసారీ తాను మారుతానని నమ్మించేవాడని, తన ప్రియురాలి విషయాన్ని బయటపెడితే చచ్చిపోతానని బెదిరించేవాడు. సమావేశంలో ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top