ప్రేమను తిరస్కరించిందని అప్రతిష్టపాలు చేశాడు

Man Arrest in Cyber Crime Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమను నిరాకరించిన యువతుల ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో ‘సెక్సీగర్ల్స్‌ కాల్‌ మీ 24 అవర్స్‌’ అనే క్యాప్షన్‌ పెట్టి సమాజంలో అప్రతిష్టపాలు చేసిన యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, పాన్‌గల్లుకు చెందిన నాగరాజు శివరాంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి చదువుకునే సమయంలో ఓ బాధితురాలితో పరిచయం ఉంది.

ఆమె ద్వారా తన స్నేహితురాలిని పరిచయం చేసుకున్న అతను తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. ఓ రోజు ప్రేమిస్తున్నానంటూ చెప్పడంతో ఆమె తిరస్కరించింది. ఆ తర్వాత బాధితురాలికి కూడా ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆమె తోసిపుచ్చింది. దీంతో వారిపై పగ పెంచుకున్న నాగరాజు రాత్రి వేళల్లో వారికి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేసే వాడు. వారి ఫొటోలను సేకరించి వాట్సాప్‌ స్టేటస్‌లో ఆప్‌లోడ్‌ చేసి ‘సెక్సీ గర్ల్స్‌ కాల్‌ మీ 24 అవర్స్‌’ అంటూ క్యాప్షన్‌ పెట్టడాన్ని గుర్తించిన బాధితురాలు అతడికి ఫోన్‌ చేసి వాటిని తీసేయాలని కోరింది. అయినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top