‘మహా’ డేంజర్‌

Maharashtra Gangs Arrest in Hyderabad - Sakshi

అత్యంత ప్రమాదకరమైన మహారాష్ట్ర ముఠాలు

అక్కడి కొండ ప్రాంతాల్లోనూ అనేక పార్థీ గ్యాంగ్స్‌

రెండు రోజుల క్రితం చిక్కింది మధ్యప్రదేశ్‌ ముఠా

వీరికంటే మహారాష్ట్రకు చెందిన వారు క్రూరులు

కొన్నేళ్ల క్రితం వరకు నగరంలో వారి కదలికలు

సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి చోరీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్‌ను ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. తార్నాకలో జరిగిన ఓ చోరీ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శనివారం ప్రకటించిన విషయం విదితమే. పార్థీ గ్యాంగ్‌లలో అనేక ముఠాలు ఉండగా వీరు మధ్యప్రదేశ్‌కు చెందిన పాసి పార్థీలు. ఇదే తెగకు చెందిన, మహారాష్ట్ర కేంద్రంగా పని చేసే పన్‌ పార్థీలు, గ్రామ్‌ పార్థీలు అత్యంత ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. బందిపోటు, దోపిడీ దొంగతనాలు చేస్తూ పాశవికంగా హత్యలు చేసే వీరు కొన్నేళ్ల క్రితం వరకు ఉమ్మడి సైబరాబాద్‌లో సంచరించినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఉంటూ జంతువుల్ని వేటాడి తినడం వారి వృత్తిగా పేర్కొన్నారు. అత్యంత క్రూరమైన మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్స్‌ వ్యవహారశైలి ఇదీ...

పగలు రెక్కీ... రాత్రికి పంజా...
కొన్నేళ్ల క్రితం వరకు సైబరాబాద్‌ (ప్రస్తుత రాచకొండతో సహా) శివార్లలో ఒంటరి ఇళ్లు, ఫామ్‌హౌస్‌లను ఎంచుకుని  బందిపోటు దొంగతనాలకు పాల్పడేవారు. వేటాడే సమయంలో క్రూరమృగాలపై దాడి చేసే తరహాలోనే  మనుషుల పైనా విరుచుకుపడతారు. బాధితుల్ని తీవ్రంగా గాయపరచడం, ఎదిరిస్తే హతమార్చడం వారి నైజం. నిర్మానుష్య ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉంటూ పగలు ప్లాస్టిక్‌ వస్తువులు, పూసలు అమ్ముకునే వారిలా వీధుల్లో తిరుగుతారు. అనువైన ఇంటిని ఎంపిక చేసుకుని అర్ధరాత్రి దాటిన తరవాత పంజా విసురుతారు. అవసరమైతే హత్యలకూ తెగబడి అందినంత దోచుకెళతారు. ఈ ముఠా పేరు చెబితే పోలీసులు సైతం హడలిపోయేవారు.  

పార్థీల చరిత్ర ఇదీ...
బ్రిటీష్‌ కాలంలో ఉత్తరాదికి చెందిన పార్థీ గ్యాంగ్‌లను క్రిమినల్‌ ట్రైబల్‌ యాక్ట్‌ కింద నోటిఫై చేశారు. అప్పట్లో వీరు  నేరాలు మాత్రమే చేస్తుండటంతో వారిపై పటిష్ట నిఘా ఉంచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం పార్థీలకు జీవనోపాధి కల్పించడంతో దాదాపు 99 శాతం మంది తమ జీవనశైలి మార్చుకున్నారు. అయినా ఇప్పటికీ కొన్ని ముఠాలు నేరాలనే జీవనాధారంగా చేసుకున్నాయి. అలాంటి గ్యాంగ్‌లు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన ముఠాలకు గణేష్‌ బాపు రావు పవార్‌ దలే నాయకుడిగా ఉండేవాడు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పేరున్న ఇతడిపై సైబరాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, గుంటూరు జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. 2005లో సైబరాబాద్‌ విభాగంలోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు  ఇతడిని అరెస్టు చేశారు. అనంతరం2011లో సైబరాబాద్‌ పోలీసులే అతడి సోదరుడు రాహుల్‌ బాపురావు పవార్‌ను పట్టుకున్నారు. 

సీజన్లు మారుస్తూ పంజా...
ఈ ముఠాలు సాధారణంగా వేసవిలోనే సైబరాబాద్‌లో విరుచుకుపడేవి. పార్థీలు ఏటా సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు తమ స్వస్థలాల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. డిసెంబర్‌లో దొంగతనాలు ప్రారంభించే వీరు మహారాష్ట్ర, ఆపై గుజరాత్‌లో నేరాలు చేసేవారు. అక్కడి నుంచి సైబరాబాద్‌కు చేరే సరికి మార్చి, ఏప్రిల్‌ వచ్చేది. అలా ఆగస్టు వరకు సైబరాబాద్‌తో పాటు నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్‌ తదితర జిల్లాల్లో విరుచుకుపడేవారు. ఇక్కడి నుంచి కర్ణాటకలోకి ప్రవేశించి సెప్టెంబరు వచ్చేసరికి మళ్ళీ తమ స్వస్థలాలకు చేరేవారు. ఒక్కోసారి ఈముఠాలు సీజన్‌ను మారుస్తూ నవంబరులోనూ సైబరాబాద్‌పై విరుచుకుపడేవారు. పోలీసుల్ని ఏ మార్చడానికి ఈ ఎత్తు వేసేవారని తెలుస్తోంది.  

పార్ధీ గ్యాంగ్స్‌ నైజమిదీ...
శివార్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తారు. రాహుల్‌ బాపురావు పవార్‌ ముఠా అప్పట్లో లింగంపల్లిలో మకాం వేసింది. పగలు గ్యాంగ్‌లోని మహిళలు రెక్కీ నిర్వహించేవారు. అనువైన ఇళ్లను ఎంచుకుని అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడేవారు. సాధారణంగా దొంగతనం చేయబోయే ఇంటి ఆవరణలో, ఇంట్లో చేతికి దొరికిన వస్తువుతో పాశవికంగా దాడి చేస్తుంది. ఆ సమయంలో  బాధితులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. బాధితుల్ని గాయపరచడం ద్వారా భయభ్రాంతులకు గురిచేసి... ఆపై సొత్తు చేజిక్కించుకోవడం వీరి నైజం. వీరు ఎక్కువగా బాధితుల తలపైనే దాడి చేస్తుంటారు.

బందిపోటు దొంగతనాలు చేసేదిలా...
వీరు తాము ఎంచుకున్న ఇంటి పరిసరాలను ముందుగానే పూర్తిగా పరిశీలిస్తారు. ‘సకుటుంబ సపరివార సమేతంగా’ రంగంలోకి దిగుతారు. కిటికీ గ్రిల్స్‌ తొలగించడం, బలవంతంగా కిటికీ, తలుపులు పగులకొట్టడం ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తారు. రావడంతోనే ఇంట్లోని వారందరినీ బంధించి దాడికి దిగుతారు. ఏమాత్రం ఎదురుతిరిగినా హతమార్చడానికీ వెనుకాడరు. స్వయంగా ఇల్లంతా వెతికి విలువైన ఆభరణాలు, డబ్బు దోచుకుంటారు.  ఒంటిపైనున్న ఆభరణాల్ని తీసిచ్చే అవకాశాన్నీ బాధితులకు ఇవ్వరు. బలవంతంగా లాక్కుంటారు. ఒక్కసారి ఓ ప్రాంతంలోకి ప్రవేశించిన తరవాత వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడతారు. ఈ కారణంగానే పార్ధీ గ్యాంగ్‌ పేరు చెప్పగానే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. నాగోలులోని కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీలోని ఓ ఇంట్లో కొన్నేళ్ల క్రితం వీరు సృష్టించిన విలయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top