తెలియనితనం.. తీసింది ప్రాణం

Lovers Commits Suicide In Visakhapatnam - Sakshi

ప్రియురాలి మృతి

ప్రియుడి పరిస్థితి విషమం

సాక్షి, కోటవురట్ల (విశాఖపట్నం): జీవితంపై అవగాహన లేని వయస్సులో ప్రేమ..ఆపై తొందరపాటు నిర్ణయం వెరసి ఆత్మహత్యాయత్నం..ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం ఇదీ ఓ ప్రేమజంట పరిస్థితి. తల్లిదండ్రుల కలలను చిదిమేసి, ప్రేమలో పడి పదిహేడేళ్ల బాలిక ప్రాణాలను కోల్పోగా, కన్నవారి నమ్మకాన్ని ఒమ్ముచేసి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రాణాలతో పోరాడుతున్నాడు యువకుడు. వివరాల్లోకి వెళితే పాములవాక గ్రామానికి చెందిన ఏకా నాయుడు పదో తరగతి చదివి మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. 

అదే గ్రామానికి చెందిన రాజాన చంద్రిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసి నర్సీపట్నంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో చేరింది. ఒకే కులానికి చెందిన వీరిద్దరూ పక్క పక్క వీధుల్లో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. అయితే ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిస్తే ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు వస్తాయన్న ఆందోళనతో  నాయుడు, చంద్రిక  సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పాములవాక శివారు పట్టాలమ్మతల్లి ఆలయం సమీపంలోని పంట పొలాల్లో ఇద్దరూ పురుగు  మందు తాగారు.  ఆపై యువకుడు తన మిత్రులకు, బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు.

వెంటనే మిత్రులు, గ్రామస్తులు అక్కడకు చేరుకునేసరికి ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఇద్దరినీ బైకులపై నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రిక(17) మృతి చెందగా, నాయుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉండడంతో 24 గంటలు దాటితే కాని ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపినట్టు చెబుతున్నారు. మృతురాలు చంద్రిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మధుసూధనరావు తెలిపారు. చంద్రిక మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top