అయ్యో పాపం..!

krishna river suicide spot special story - Sakshi

కృష్ణానదిలో... అంతుచిక్కని మరణాలెన్నో...

చివరి చూపునకు నోచుకోని  బంధువులు

పోలీసులే ఆ శవాలకు దిక్కు

కృష్ణానదీగర్భంలో అంతుచిక్కని మరణాలు ఎన్నో... మృగాడి బారిన పడి తనువు చాలించిన అబలలు కొందరైతే, బతుకు భారమై జీవితంపై విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరి కొందరు. ఆర్థిక లావాదేవీల్లో హత్యకు గురైన వారు, ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందిన వారు మరి కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది పొడవునా ఎందరో అభాగ్యులు, అనాథలు కృష్ణానదిలో తనువు చాలించి చివరికి ప్రకాశం బ్యారేజి వద్ద శవాలుగా కనిపిస్తున్నారు.

తాడేపల్లి రూరల్‌ : ప్రకాశం బ్యారేజీ వద్ద అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల కాలంలో ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు గుర్తించిన శవాల సంఖ్య 120 కాగా వీటిలో 36 శవాల ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలిన 84 శవాలను వారి బంధువులు గుర్తించారు. అయితే 36 శవాలను గుర్తుతెలియని మృతదేహాలుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారే తప్ప వాటìపై ఇంతవరకు దర్యాప్తు చేయలేదు. గతంలో కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలోని మంతెన గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి మర్మాం గాలపై దాడి చేసి, అతడిని చంపి కృష్ణా నదిలో పడవేసిన సంఘటనలో ఆరు నెలల తరువాత గాని అసలు విషయం బయటపడలేదు. అప్పటికీ ఆ మృతదేహాన్ని చూచిన తాడేపల్లి పోలీసులు 174 కింద కేసు నమోదు చేశారేకానీ, కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేపట్టకపోవడం గమనార్హం.

ఎక్కడెక్కడివారో ఇక్కడే ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ శవాలై తేలిన సంఘటనలు చాలా ఉన్నాయి. పోలీసులు పంచనామా నిర్వహించిన సమయంలో వారి దుస్తులలో ఏమైనా గుర్తింపు కార్డులు దొరికితే తప్ప బంధువులకు సమాచారం ఇవ్వరు. పోలీసులు సైతం రెండు, మూడు రోజులు శవా లను శవాగారాలలో ఉంచి అనంతరం ఖననం చేస్తున్నా రు. ఆచూకీ తెలియని శవాల తాలూకు బంధువులు వివరా లు తెలియక బతికున్నారో, చనిపోయారో తెలియక మనో వేదనకు గురవుతున్నారు. ఎవరైనా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు శవాల ఆచూకీ కోసం వస్తే కుళ్లిపోయిన శవాలను, ఫోటోలు చూసి గుర్తించకలేక కన్నీరు పెట్టుకుంటూ వెనుతిరిగి వెళ్తున్నారు. పోలీసులు వారి బాధను అర్థం చేసుకుని, వారి ఒంటిపై ఉన్న దుస్తులను సైతం భద్రపరిచి వచ్చిన  వారికి చూపించినా, ఒకటి రెండు శవాల ఆచూకీ తప్ప మిగతా శవాల ఆచూకీమాత్రం తెలియడంలేదు.

నిఘా పెంచాలి
ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా పోలీసులు నిఘా పెంచి వాహనాల తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో బయటపడతాయి. గుంటూరు జిల్లా పరిధి ప్రకాశం బ్యారేజి 36వ కానా వరకు ఉండగా, తాడేపల్లి అవుట్‌ పోస్టు వద్ద నుంచి 6వ కానా కనపడే విధంగా సీసీ కెమారాలు ఏర్పాటు చేయడంతో గత రెండు సంవత్సరాలలో ఆత్మహత్యలకు పాల్పడబోయిన వందలాదిమందిని పోలీసులు కాపాడగలిగారు. అలాగే అవుట్‌ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేయడం వల్ల సంఘ విద్రోహశక్తులను అదుపులోకి తీసుకోగలిగారు. ప్రకాశం బ్యారేజీని అడ్డాగా చేసుకుని సాగించే గంజాయి అమ్మకాలను కూడా నివారించగలిగారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్‌ పోస్టు మాదిరిగానే విజయవాడ పోలీసులు అటువైపు బ్యారేజీ వద్ద అవుట్‌ పోస్టును ఏర్పాటు చేసి సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తే బ్యారేజీపై ఆత్మహత్యలు, హత్యలతోపాటు సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓ ప్రేమ జంట బ్యారేజీ మీద మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ప్రియురాలు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయాన్ని గమనించిన వాహనచోదకులు 100కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిఘా అయితే పెంచారు కానీ ప్రియుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. చివరికి మృతదేహం ఎవరిదో ఈ నాటికి కూడా గుర్తించలేకపోయారు. అదే అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ప్రియుడిని అప్పుడే అదుపులోకి తీసుకునేవారు. అంతేకాకుండా నెల రోజుల క్రితం ప్రకాశం బ్యారేజీ 34వ కానా వద్ద జీన్‌ ప్యాంటు, టీషర్టు ధరించిన సుమారు 30 సంవత్సరాల లోపు వయస్సు గల ఓ యువ తి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రకాశం బ్యారేజీ మొత్తం కనబడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే చాలా వరకు హత్యలను, ఆత్మహత్యలను నివారించడానికి అవకాశం ఉంటుంది.

పోలీసుల సేవలు అభినందనీయం
కృష్ణానది గర్భంలో మృతిచెందిన వారిని బయటకు తీయడంలో తాడేపల్లి పోలీసుల సేవలు అభినందనీయం. చనిపోయి రెండు, మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించడం, అప్పటికే శవం ఉబ్బిపోయి, కుళ్లిపోయి, దుర్వాసన వస్తుంది. ఆ శవాన్ని నదిలోనుంచి బయటకు తీసి, శవ పంచనామా నిర్వహించి, తిరిగి  మార్చురీకి తరలించడంలో తాడేపల్లి పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏదో శవం కొట్టుకొచ్చింది, మనకెందుకులే అని వదిలివేయకుండా ఆచూకీ కోసం అణువణువు పరిశీలించి, పత్రికలలో వివరాలను ప్రచురింపచేసి శవాల ఆచూకీ తెలుసుకునే చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్కసారి మృతిచెందినవారిని పోలీసులే తమ చేతుల మీదే మోసుకుంటూ బయటకు తీసుకువస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top