కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!

Kodela Sivaram In Deep Soup With Police Cases - Sakshi

వణికిపోతున్న కోడెల కుటుంబం

టీఆర్‌ లేకుండా 800 బైక్‌లు విక్రయించినట్లు గుర్తింపు

వాహనదారుల నుంచి స్టేట్‌మెంట్‌ నమోదు

క్రిమినల్‌ కేసులు నమోదయ్యే అవకాశం

సాక్షి, గుంటూరు: టీఆర్‌ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్‌ లేకుండా బైక్‌లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.

టీఆర్‌ (తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) లేకుండా 800 బైక్‌లను కోడెల శివరామ్‌ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్‌ షోరూమ్‌ను రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేశారు. టీఆర్, లైఫ్‌ ట్యాక్స్‌ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్‌కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్‌ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. 

వాహనదారుల నుంచి స్టేట్‌మెంట్‌లు..
గౌతమ్‌ షోరూమ్‌ నుంచి టీఆర్‌ లేకుండా డెలివరీ చేసిన బైక్‌ల వివరాలను ఇన్వాయిస్‌లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా  బైక్‌లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్‌మెంట్‌లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్‌ కొనుగోలు సమయంలో తమకు టీఆర్‌ ఇవ్వలేదని, లైఫ్‌ ట్యాక్స్, టీఆర్‌ ఫీజుల పేరుతో రూ. 8–10  వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్‌మెంట్‌ సేకరించిన అధికారులు స్టేట్‌మెంట్‌లను రవాణా శాఖ కమిషనర్‌కు నివేధించారు.  విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్‌పై  క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తారు.  

బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్‌ కంపెనీలు..
టీఆర్‌ లేకుండా గౌతమ్‌ షోరూమ్‌ యాజమాన్యం 800 బైక్‌లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్‌లను వినియోగదారులు ఫైనాన్స్‌ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్‌ జనరేట్‌ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్‌స్టాల్‌మెంట్స్‌) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్‌ కంపెనీలు బైక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్‌ జనరేట్‌ కాకపోవడంతో ఆ బైక్‌లు రిజిస్ట్రేషన్‌ అవ్వక వేరొకరికి బైక్‌లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్‌లన్నింటినీ ఫైనాన్స్‌ కంపెనీలు తమ గోడౌన్స్‌లో ఉంచుకున్నాయి. 

టీఆర్‌ లేని వాహనాలను నడపడం నేరం
తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్‌ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్‌ చేస్తారు. అదే విధంగా టీఆర్‌ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్‌ వంటి ఇతర స్కీమ్‌లు వర్తించవు. గౌతమ్‌ షోరూమ్‌ నుంచి టీఆర్‌ లేకుండా బైక్‌లు విక్రయించినవారు బైక్‌లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. 
   – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top