కిడ్నాప్‌ కలకలం!

Kidnap Case Happy Ending - Sakshi

 తొందరపాటులో అల్లుడినిఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌

ఫిర్యాదు అందిన 17గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

కటకటాల వెనక నిందితుడు

కొత్తకోట: జిల్లాలో ఓ బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. కిడ్నాపర్ల  బెదిరింపులకు భయపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఫిర్యాదు స్వీకరించిన 17 గంటల్లోనే కేసును ఛేదించారు. మంగళవారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో గద్వాల ఎస్పీ రేమా రాజేశ్వరి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొత్తకోట మండలం నాటవెళ్లి పంచాయతీ పరిధిలో గల ఊరగట్టు తండాకు చెందిన రాజు నాయక్‌కు ఇద్దరు కుమారులు శివనాయక్, చందూనాయక్‌ ఉన్నారు. కోయిల్‌కొండ మండలం రాళ్లగడ్డ తండాకు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు రాజునాయక్‌ చిన్న కుమారుడు చందునాయక్‌ను కిడ్నాప్‌కు యత్నించాడు.

ఇదీ విషయం..
రాజునాయక్‌ తన ఇద్దరు కుమారులతోపాటు చెల్లెలు నారమ్మ కుమారుడు సంతోష్‌ నాయక్‌ సైతం కొత్తకోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ అక్కడే హాస్టల్‌ల్లో ఉంచాడు. ఈనెల 8న ఉదయం 9గంటల సమయంలో వంశీకృష్ణ నాయక్‌ పాఠశాలకు వెళ్లి నారమ్మకు రోడ్డు ప్రమాదం జరిగిందని.. మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి వచ్చానని నమ్మబలికాడు. దీంతో ముగ్గురు పిల్లలను ఆటోలో ఎక్కించుకుని కొత్తకోట చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఆటోను ఆపి కాయిన్‌ బాక్స్‌ నుంచి ఎవరికో ఫోన్‌ చేశాడు. నారమ్మ కుమారుడు చందూనాయక్‌ అనుకుని శివనాయక్‌ను, సంతోష్‌ నాయక్‌ను ఇద్దరిని అక్కడే దించేసి చందూనాయక్‌ను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. వెంటనే ఆ ఇద్దరు విద్యార్థులు విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. బాలుడు కిడ్నాపైనట్లు గుర్తించిన నానమ్మ జూలి కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచుతూ విచారణ చేపట్టారు. కొత్తకోటలో వంశీకృష్ణ నాయక్‌ ఎక్కడ ఫోన్‌ చేశాడో అక్కడి నుంచి విచారణ ప్రారంభించిన పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఫాలో అయ్యారు.  

నారమ్మను లొంగదీసుకోవాలని..
రాజునాయక్‌ చెల్లెలు నారమ్మ కొంతకాలంగా హైదరాబాదులో ఉంటోంది. అక్కడే ఉన్న వసీంబాబా అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే చెడు వ్యసనాలకు బానిసైన నారమ్మ అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వంశీకృష్ణ నాయక్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వసీంబాబా లేని సమయంలో వంశీకృష్ణ నారమ్మ ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ విషయం బంధువులకు తెలియడంతో వారు వంశీకృష్ణను మందలించి దూరం చేశారు. ఆ కోపంతో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని వంశీకృష్ణ కిడ్నాప్‌ డ్రామా ఆడాడు.   

ఇలా చిక్కాడు..
కిడ్నాపర్‌ ఫోన్‌ కాల్‌ను ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. కాయిన్‌ బాక్స్‌ నుంచి  హైదరాబాద్‌లోని వసీంబాబాతో మాట్లాడినట్లు గుర్తించారు. సీఐ సోమ్‌నారాయణ సింగ్, ఎస్‌ఐ రవికాంత్‌రావు రెండు టీంలుగా విడిపోయి హైదరాబాద్‌లోని వసీంబాబా వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. నారమ్మను తన దగ్గరకు శాశ్వతంగా పంపాలని.. లేకుంటే కిడ్నాప్‌ చేసిన బాలుడిని చంపుతానని.. ఇప్పుడు పూణెకు తీసుకెళ్తున్నానని బెదిరించాడని వసీంబాబా పోలీసులకు అసలు విషయాన్ని చెప్పాడు. ఈ క్రమంలోనే కిడ్నాపర్‌ వంశీకృష్ణ మరోమారు ఫోన్‌ చేశా డు. దాని ఆధారంగా అతన్ని మాటల్లో పెట్టించారు. అటునుంచి నారమ్మతోపాటు వసీం బాబాను సైతం వెంట పెట్టుకుని నాంపల్లి రైల్వేస్టేషన్‌కి వెళ్లారు. ఫోన్లో సంభాషణను కొనసాగిస్తూనే మరో ట్రైన్‌లో పూణె వెళ్లారు. అప్పటికే ఎస్పీ రెమారాజేశ్వరి అక్కడి ఐపీఎస్‌ పంకజ్‌దహానే, డీసీపీ గాంధీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ల సహకారం తీసుకుని సోమవారం అర్ధరాత్రి 2.15 నిమిషాలకు పూణె రైల్వేస్టేషన్‌లో చందూనాయక్‌ను క్షేమంగా రక్షించారు. అనంతరం కిడ్నాపర్‌ను వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.    

అభినందించిన ఎస్పీ  
కిడ్నాప్‌ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్‌ను, ఎస్‌ఐ రవికాంత్‌రావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరులకు కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలు తెలియజేసిన అనంతరం వారిని వెన్నుతట్టారు. బాలుడిని క్షేమంగా అప్పగించడంతో తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top