కారుకు గీతలు పడ్డాయని..

Kidnap And Murder Case File Against Car Rentals Owner - Sakshi

వ్యక్తిపై దాడి హత్యాయత్నం కేసు నమోదు

నిందితుల రిమాండ్‌

మియాపూర్‌: ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడిన కేసులో  నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన మియాపూర్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట్‌ గ్రామం, భండారి లే అవుట్‌లోని భవ్య సాయి నివాస్‌లో ఉంటున్న ఉప్పలపాటి కాశీ విశ్వనాథ్‌ రాజు ఈ నెల 19న చందానగర్‌కు చెందిన గంపా శ్రీహర్ష నుంచి ఇన్నోవా  కారును అద్దెకు తీసుకున్నాడు. ఇందుకు గాను బ్లాంక్‌ చెక్, బైక్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌ కార్డ్,  ఆధార్‌ కార్డులను షూరిటీగా ఉంచాడు.  ఈనెల 27న కారు తిరిగి ఇస్తుండగా కారుపై గీతలు పడినందున రూ. 20వేలు చెల్లించాలని శ్రీహర్ష డిమాండ్‌ చేయడంతో విశ్వనాథ్‌ అతను కోరిన మొత్తం చెల్లించాడు.

అయితే తిరిగి శుక్రవారం మధ్యాహ్నం శ్రీహర్ష తన స్నేహితులు మధు, రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్‌ నాయక్‌తో కలిసి కేపీహెచ్‌బీలోని కాశీ విశ్వనాథ్‌ ఆఫీస్‌ వద్దకు వెళ్లి అదనంగా రూ.55వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే అంత మొత్తం తానివ్వలేనని విశ్వనాథ్‌ చెప్పడంతో శ్రీహర్ష అతని మిత్రులు అతడిని కారులో బలవంతంగా ఎక్కించుకుని కొండాపూర్‌లోని హర్షా టయోటా షోరూమ్‌కు తీసుకెళ్లారు. అనంతరం అతడిని హఫీజ్‌ పేట్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లి  దాడికి పాల్పడ్డారు. దీంతో రాజు వారికి తెలియకుండా  తన సెల్‌ఫోన్‌ నుంచి పోలీసులకు లొకేషన్‌ షేర్‌ చేసి, తనను రక్షించాలంటూ కోరాడు. అక్కడికి చేరుకున్న మియాపూర్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.  హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top