భార్య కాళ్లు చేతులు కట్టేసి.. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి..

Kannada actor Sabrish Shetty scheme for murdering second wife - Sakshi

రెండో భార్య హత్యకు కన్నడ నటుడి పథకం 

స్నేహితుడు రావడంతో ఆఖరి క్షణంలో ప్రాణాలతో బయటపడిన యువతి

కృష్ణరాజపురం (బెంగళూరు): సినిమాల్లో నటించి నటించి నిజ జీవితంలో కూడా నటించడం, మోసం చేయడం వంటబట్టించకున్నాడేమో.. ఓ శాండల్‌వుడ్‌ నటుడు సినిమా తరహాలోనే భారీ నేరానికి పథకం వేశాడు. ఓ యువతికి రంగుల కలలు చూపి మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. అతని మోసాన్ని పసిగట్టి ప్రశ్నించిన ఆమెను మత్తు ఇంజెక్షన్లు వేసి హత్య చేయబోయాడు. చివరి నిమిషంలో ఆమె మిత్రుడు రావడంతో ఆమె బతికిపోయింది.  

శబరీష్‌ శెట్టి అనే వర్థమాన నటుడు పలు కన్నడ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. హీరోగా నటించిన అరుణ్, జనన అనే రెండు చిత్రాలు కొద్ది రోజులు చిత్రీకరణ జరుపుకొని నిలిచిపోయాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పద్మశ్రీ అనే యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు తనకు కన్నడ చిత్రరంగంలో పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు తెలుసని చెప్పి వారితో దిగిన ఫొటోలు చూపించి పద్మశ్రీని ప్రేమలోకి దించాడు. కొద్ది కాలం తరువాత ఆమెను పెళ్లి చేసుకుని కేఆర్‌ పురం శివార్లలోని భట్టరహళ్లిలో కాపురం పెట్టాడు. 
అడ్డు తొలగించుకోవాలని 
కొద్ది రోజులకు శబరీష్‌ ప్రవర్తనపై పద్మశ్రీకి అనుమానం వచ్చింది. ఆరా తీయగా అంతకుముందే మరొక మహిళతో అతనికి వివాహమైందని తెలిసింది. దీంతో  ఆమె శబరీష్‌ను నిలదీయడంతో ఇరువురికీ గొడవలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో శబరీష్‌ పద్మశ్రీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఐదుగురు స్నేహితులను ఇంటికి రప్పించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు మత్తు ఇంజెక్షన్లు వేశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పద్మశ్రీ స్నేహితుడు వెంటనే కేఆర్‌ పురం పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు శబరీష్‌తో పాటు మరో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నలుగురు పరారయ్యారు. పద్మశ్రీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top