ఇల్లు లూఠీ

jewellery robbery in ongole  - Sakshi

ఒంగోలు నగరంలో భారీ చోరీ

రూ.3 కోట్ల విలువైన సొత్తు అపహరణ

నగరంలోని ఏనుగుచెట్టు సమీపంలో ఘటన

కుటుంబసభ్యులు తిరుమల వెళ్లొచ్చే సరికి ఇల్లు లూఠీ

వజ్రాల హారాలు, కెంపులు, పచ్చల హారాల సహా

500 సవర్లకుపైగా బంగారం మాయం

ఒంగోలు క్రైం: ఒంగోలు నగరం నడిబొడ్డున, పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా విలువైన వజ్రాల హారాలు, కెంపులు, పచ్చల హారాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు.  కుటుంబసభ్యులు తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శించుకొని వచ్చే సరికి దొంగలు ఇల్లు ఊడ్చేశారు.

సేకరించిన సమాచారం ప్రకారం.. ఒంగోలు ఏనుగుచెట్టు సమీపంలో నివాసం ఉంటున్న అప్పల కోటేశ్వరరావు పాత గుంటూరురోడ్డులో పెట్రోలుబంకు నిర్వహిస్తున్నాడు. ఆయన ఈనెల 21వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లాడు. తిరిగి సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ఇంటికి చేరుకున్నారు. వెనుక తలుపులు తీసి ఉండటం గమనించి కంగారు పడ్డారు. బీరువాలు, అలమరాలు, సేఫ్‌ లాకర్లలో చూస్తే వాటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి, వెంటనే వన్‌టౌన్‌ సీఐ ఎండీ ఫిరోజ్‌కు సమాచారం అందించారు.

దొంగతనం ఎలా జరిగిందంటే...
స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని కోటేశ్వరరావు నివాసం ఉంటున్న డూప్లెక్స్‌ భవనానికి (శ్రీ మహాలక్ష్మి నిలయం)  తూర్పు వైపు వరసంధు ఉంది. ప్రధాన ద్వారానికి తాళాలు వేసిన కోటేశ్వరరావు ఈ సందులోని కటకటాలకు తాళం వేశాడు. వెనుక వైపు ఉన్న తలుపు గడియ పెట్టకుండా మర్చిపోయి వెళ్లారు.  ఆ తలుపుకు ముందు ఇనుప మెస్‌ బిగించిన గ్రిల్స్‌కు గడియ పెట్టారు గానీ తాళం మరిచారు. దొంగతనానికి వచ్చిన దుండగుడు ఈ వరసందులో ఉన్న  కటకటాల తాళం బుర్రలను పగులగొట్టాడు. ఇనుప మెస్‌ను తొలగించి గడియ మాత్రమే పెట్టిన గ్రిల్స్‌ను తీసుకొని సులభంగా లోనికి ప్రవేశించాడు.

ఇంట్లో ఉన్న బీరువాలు, సేఫ్‌ లాకర్లు, అలమరాల తాళాలు పగులగొట్టాడు. రూ.70 లక్షలు విలువ చేసే వజ్రాల హారం, రూ. 60 లక్షలకుపైగా విలువైన వజ్రాలు పొదిగిన పచ్చల హారాలు, కెంపుల హారాలతో పాటు ఏడు వారాల నగలు మొత్తం 500 సవర్లకుపైగా బంగారు ఆభరణాలు అపహరించుకుపోయినట్లు యజమాని కోటేశ్వరరావు చెప్తున్నాడు. మొత్తం వీటి విలువ రూ.3 కోట్లకుపైగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంటి ఖర్చుల కోసం ఉంచిన రూ.50 వేల నగదును కూడా అపహరించుకుపోయారు. శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కోటేశ్వరరావు కుటుంబసభ్యులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. కాగా ఆదివారం వేకుజామున లేదా రాత్రి గానీ చోరీ జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

క్లూస్‌టీం పరిశీలన..
సమాచారం అందుకున్న క్లూస్‌టీం పోలీస్‌ అధికారుల బృందం సోమవారం రాత్రి చోరీ జరిగిన ఇంటికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జక్కంరాజు ఆధ్వర్యంలో దుండగుని వేలిముద్రల నమూనాలను సేకరించారు. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు  క్రైం పార్టీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్, సీసీఎస్‌ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావులు తమ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం  పలు ప్రాంతాలకు పంపిస్తున్నానని కేశన తెలిపారు. సీఐ ఫిరోజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బూసరపు సత్య ఏసుబాబు చోరీ జరిగిన ఇంటికి వచ్చి పరిశీలించారు. ఇంటి యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు.  

కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు..
పెట్రోలుబంకు వ్యాపారంతో పాటు రియల్‌ ఏస్టేట్, ఇతర వ్యాపారాల చేస్తున్న ఇంటి యజమాని అప్పల కోటేశ్వరరావు ఖరీదైన ఇల్లు కట్టుకున్నాడు. కానీ కనీసం ఇంటి నుంచి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు. జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఇటీవల లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు సూచించారు. అయినా పట్టించుకోక పోవడం వల్లే ఇలాంటి చోరీ జరగటానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top