దుగ్గిరాలలో దొంగల బీభత్సం

Jewellery Robberies In Duggirala Guntur - Sakshi

70 గ్రాముల బంగారం, రూ.16వేలు నగదు అపహరణ

ఉలిక్కిపడిన గ్రామస్తులు

దుగ్గిరాల: చిలువూరు గ్రామంలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ ఘటన మరువక ముందే మండల కేంద్రమైన దుగ్గిరాలలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు బీభత్సం సృష్టించారు. ఆనంతపురం జిల్లాకు చెందిన పిడుగు ఆదిశేషు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన పోలూరి మల్లికార్జునరావు ఓ కర్మాగారంలో పనిచేస్తున్నారు. దుగ్గిరాల మద్దుల బజారులోని వీర వరప్రసాద్‌ ఇంట్లో  కొద్దికాలంగా పక్కపక్క పోర్షన్లలో అద్దెకు ఉంటున్నారు.  మల్లికార్జునరావు తల్లి మరణించడంతో పదిహేను రోజుల క్రితం  కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని స్వగ్రామం వెళ్లాడు. పిడుగు ఆదిశేషు ఈ నెల 16వ తేదీ అనంతపురంలోని స్వగ్రామానికి వెళ్లాడు. జనసంచారం లేని ఇళ్లే లక్ష్యంగా రెచ్చిపోయిన దొంగలు ఇంటికి వేసిన తాళాలను చాకచక్యంగా పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని విలువైన బంగారు వస్తువులు, నగదు అపహరించారు.

మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన మల్లికార్జునరావు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు వస్తువులు, నగదు అపహరణకు గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నేర విభాగం ఆడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి.స్నేహిత, తెనాలి సీఐ బి.కళ్యాణŠ రాజు, ఎస్‌ఐ కాటూరి వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలసుకున్నారు. మల్లికా>ర్జునరావు ఇంట్లో బీరువాలో ఉంచిన 10 గ్రాముల బంగారం, రూ.14వేలు నగదు మాయమైనట్టు గుర్తించారు. ఆదిశేషు ఇంట్లో సుమారు 60 గ్రాముల బంగారం, రూ.4 వేలు నగదు అపహరణకు గురైనట్టు తెలస్తుంది. ఆదిశేషు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

తిరుపతమ్మ దేవాలయ హుండీ సైతం...
తెనాలి–విజయవాడ ప్రధాన రహదారి వెంబడే ఉన్న తిరుపతమ్మ తల్లి గుడి పైన సిమెంట్‌ రేకులకు బెజ్జం వేసి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీ పగులగొట్టారు. అయితే హుండీలో సుమారు రూ.300 మాత్రమే నగదు ఉంటుందని గుడి నిర్వాహకుడు తెలిపారు. గుడి పైన ఉన్న సిమెంట్‌ రేకులకు వేసిన రంధ్రం చిన్నదిగా ఉండడంతో యుక్తవయస్సు వారు దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్, క్లూస్‌టీమ్‌ బృందాలు రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. దుగ్గిరాల ఎస్‌ఐ కాటూరి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల వైఫల్యమే కారణం
రాత్రివేళల్లో పటిష్టమైన గస్తీ నిర్వహించడంలో దుగ్గిరాల పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోరీ జరగడం దీనికి నిదర్శనం. గతంలోలా జీపులో సైరన్‌ తో గస్తీ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top