ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో యువతులను వేధిస్తే చర్యలు

IT Act ases On Social media Cyber Crime  - Sakshi

ఐటీ యాక్ట్‌ మేరకు కేసులు, రౌడీషీట్లు తెరుస్తాం

ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ హెచ్చరిక

ఏలూరు టౌన్‌: జిల్లాలో మహిళలు, యువతులను ప్రేమ, స్నేహం పేరుతో పరిచయాలు చేసుకుని.. ప్రేమపేరుతో ఫొటోలు తీసి వాటిని మార్పింగ్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆకతాయిలు కొందరు మహిళలు, యువతులే టార్గెట్‌గా ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారన్నారు.

ప్రేమ, స్నేహం పేరుతో మోసాలు చేయటమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అటువంటి వ్యక్తులపై పోలీస్‌ శాఖ నిఘా పెట్టిందని చెప్పారు. యువతులను మానసికంగా వేధిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తే అటువంటి వ్యక్తులపై ఐటీ యాక్ట్‌ మేరకు కేసులు నమోదు చేయటంతో పాటు, వారిపై రౌడీషీట్లు సైతం తెరుస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుంటే అన్ని ఉద్యోగాలకు అనర్హులవుతారని, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉండవని గుర్తు చేశారు. జిల్లాలో ఎవరికైనా యువతులు, మహిళలకు ఇలాంటి బెదిరింపులు ఎదురైతే నేరుగా, లేదా మెస్సేజ్‌ రూపంలో తనకు తెలియజేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి వాటిపై ఐటీ విభాగం నిఘా పెట్టిందని, ఎవరిమీదైనా అనుమానం వస్తే అటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలని ఆయన పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చినా, అనుమానం కలిగినా వెంటనే వారి సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్‌లు తనిఖీలు చేయటమే కాకుండా, ఇళ్లను సైతం సోదాలు చేయాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top