కట్టుకున్నోళ్లే కడతేర్చారు

Husband Killed Wife in Hyderabad - Sakshi

జీవితాంతం కలిసుంటామని వివాహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు తమ భార్యలను దారుణంగా హత్యచేశారు. నగరంలోని వేర్వేరుచోట్ల ఈ హత్యలు జరిగాయి.

జవహర్‌నగర్‌: కట్టుకున్న భార్యనే ఓ వ్యక్తి అమానుషంగా హత్య చేశాడు.ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని వికలాంగుల కాలనీ సమీపంలోని శివనగర్‌లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు..కర్నూలు జిల్లా నంద్యాల భర్మశాల చెందిన విజయ్, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన  శాంతి (28)లకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వృత్తిరీత్యా పాత చీరలు కొనుగోలుచేసి బాసళ్లు (గిన్నెలు) అమ్ముతుంటారు.జవహర్‌నగర్‌లోని వికాలంగులకాలనీ సమీపంలోగల శివనగర్‌కు వలస వచ్చి ఓ గదిలో  నివాసముంటున్నారు. ఇద్దరు పెద్దకుమారులను నంద్యాలలోని హసల్ట్‌లో ఉంచారు. బుధవారం సాయంత్రం భార్య,భర్తలు కలిసి భోజనం చేసిన  తర్వాత మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. ఇద్దరి మద్య గొడవ ముదరడంతో భర్త విజయ్‌ ఆవేశంతో భార్య శాంతి మెడపై కత్తెరతో దారుణంగా పొడిచాడు. దీంతో  ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే విజయ్‌ చిన్నకుమారున్ని  తీసుకుని ఇబ్లీబన్‌లో బస్సు ఎక్కి నంద్యాలలోని తన నివాసానికి వెళ్లి తల్లిదండ్రులకు చిన్నకుమారుడిని అప్పగించాడు.  విజయ్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు జవహర్‌నగర్‌లో నివాసముంటున్న తమ బందువు ఓబులేష్‌కు ఫోన్‌చేశారు. వెంటనే ఓబులేష్‌ శివనగర్‌లో నివాసముంటున్న విజయ్‌ నివాసానికి వెళ్లి చూడగా శాంతి  గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించగా కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ సైదులు సంఘటన స్థలా నికి చేరుకుని డాగ్‌స్వాడ్‌తో పాటు క్లూస్‌ టీంపు రప్పించి  వివరాలు సేకరించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి నిందితుని కోసం  పోలీçసులు గాలింపు చర్యలు చేపట్టారు.

దుండిగల్‌:  కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న  భార్యనే  కడతేర్చాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన మేరకు.. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ప్రభాకర్, రమాదేవి (42) భార్యాభర్తలు. వీరు 15 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ప్రగతినగర్‌లోని ఎలీప్‌ ఇండస్ట్రీలో స్థిర పడ్డారు. వీరికి అరుణ్, వైష్ణవి, శైలజ  ముగ్గురు పిల్లలున్నారు. ప్రభాకర్‌ వెల్డింగ్‌ పనులు చేస్తుండగా రమాదేవి గృహిణి. వీరి ముగ్గురు పిల్లలు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో 8 నెలల క్రితం వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి తన కుమార్తెలు వైష్ణవి, శైలజలతో కలిసి ఎలీప్‌ ఇండస్ట్రీస్‌ లో ఉంటుండగా  ప్రభాకర్, కుమారుడు అరుణ్‌కుమార్‌తో బాచుపల్లి సాయినగర్‌లో ఉంటున్నాడు.  గురువారం మధ్యాహ్నం రమాదేవి ఇంటికి వచ్చిన ప్రభాకర్‌ ఆమెతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో రాడ్డుతో భార్య తలపై మోదాడు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. హత్య  చేసిన అనంతరం ప్రభాకర్‌ నేరుగా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top