ఏసీబీ వలలో జీఎంసీ బిల్‌ కలెక్టర్‌

Guntur Muncipal Corporation Bill Collector Arrested By ACB Rides For Taking Bribe - Sakshi

7వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం 

ఇంటి పన్ను మార్చేందుకు లంచం డిమాండ్‌

సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : ఇంటి పన్ను మార్చేందుకు బిల్‌ కలెక్టర్‌ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ  టి.కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరువారితోట 6వ లైనులో నివాసం ఉండే కె.పాండవులు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలో ఉన్న నివాసాన్ని తన ఇద్దరు కుమారులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అయితే ఇంటి పన్ను మార్చేందుకు వారం రోజుల కిందట కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఇంటి పన్ను అంచనా వేసి మార్చేందుకు గాను బిల్‌ కలెక్టర్‌ భూపతి వీర్రాజు రూ.10వేలు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇస్తే తప్ప తాను ఇంటి పన్ను మార్చే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు.

నాలుగు సార్లు అతని చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి ప్రతిఫలం లేదు. అనంతరం రూ.7వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ నెల 16వ తేదీన పాండవులు ఏసీబీ అధికారులను కలిశాడు. రెండు రోజులపాటు తాను ఊర్లో ఉండనని చెప్పడంతో ఏసీబీ అధికారులు సోమవారం సదరు బిల్‌ కలెక్టర్‌కు వలపన్నారు. ఈక్రమంలో ఉదయం సమయంలో పాండవులు బిల్‌ కలెక్టర్‌ భూపతి వీర్రాజుకు ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తాను రమ్మని పిలిచాడు. అప్పటికే నగదును సిద్ధం చేసిన ఏసీబీ అధికారులు పాండవులు ద్వారా బిల్‌ కలెక్టర్‌ వీర్రాజుకు నగదు అందజేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న వీర్రాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు అతడిని వెంటనే ఏసీబీ కార్యాలయానికి  తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top