కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

Government Teacher has Suspended In Cheepurupalli - Sakshi

 పాఠశాలలో విచారణ చేపట్టిన డీఈఓ నాగమణి

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల పట్ల గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎ.రాంబాబు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని చీపురుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధ్యాయుడు ఎ.రాంబాబును సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వి.అప్పారావు ఉపాధ్యాయుడు రాంబాబుకు శుక్రవారం రాత్రి అందజేశారు. అయితే ఇదే ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చి విచారణ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరినీ పాఠశాలకు రప్పించి విచారించారు. అలాగే బాధిత విద్యార్థినులతో కూడా మాట్లాడారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు రాంబాబు అనుచితంగా ప్రవర్తించినట్లు స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిందితుడ్ని సస్పెండ్‌ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో నమ్మకంతో విద్యార్థినులు వస్తారని..  ఉపాధ్యాయులు ఇటువంటి నీచమైన పనులు చేయకూడదని హితవు పలికారు. దర్యాప్తు పూర్తి నివేదికను కలెక్టర్, కమిషనర్‌కు పంపిస్తామన్నారు. విచారణలో డిప్యూటీ డీఈఓ సత్యనారాయణ, ఇన్‌చార్జి ఎంఈఓ భానుప్రకాష్, పాఠశాల హెచ్‌ఎం వి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top