లైంగిక దాడి.. బాలిక మృతి

Girl Died In Tamil Nadu After Molestation - Sakshi

కుటుంబీకుల ఆందోళన

ధర్మపురిలో ఉద్రిక్తత

నిందితుల కోసం గాలింపు

మూడ్రోజుల క్రితం అత్యాచారానికి గురైన బాలిక  మరణించడంతో ధర్మపురిలో ఉత్కంఠకు నెలకొంది. నిందితుల అరెస్టుకు పట్టుబడుతూ కుటుంబీకులు, మహిళ, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించడంతో కలెక్టర్‌ మలర్‌ విళి వారిని బుజ్జగిస్తున్నారు.

సాక్షి, చెన్నై : ధర్మపురి జిల్లా అరూర్‌ చిక్లింగ్‌ మలైకి చెందిన అన్నామలై, మలర్‌ దంపతుల కుమార్తె సౌమ్య(17) పాపిరెడ్డి పట్టిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంటూ ప్లస్‌టూ చదువుకుంటోంది. దీపావళి సందర్భంగా ఐదో తేదీ  స్వగ్రామానికి వచ్చిన ఆమె బహిర్భూమికి వెళ్లింది. ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం లేని దృష్ట్యా, బహిర్భూమికి వెళ్లిన సౌమ్య తిరిగి రాకపోవడంతో తల్లి మలర్‌ సమీపంలోని పొదలవైపు పరుగులు తీసింది. అక్కడ అపస్మారక స్థితిలో కుమర్తె పడి ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ధర్మపురి ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆమె లైంగిక దాడికి గురైనట్టుగా తేలింది. ఈ సమాచారంతో అన్నామలై, మలర్‌ దంపతులు పోలీసులను ఆశ్రయించినా స్పందన లేదు. చివరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం టోల్‌ ఫ్రీని సంప్రదించాల్సి వచ్చింది. ఏడో తేదీన బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే, అక్కడ సౌమ్య ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సౌమ్య మరణించింది.

టోల్‌ ఫ్రీ మేరకు ఫిర్యాదు
అత్యాచారం విషయంగా పోలీసులు తొలుత స్పందించకున్నా, ఆ తదుపరి మేల్కొనక తప్పలేదు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు బాధితు రాలి తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదుచేశారు. చికిత్స పొందుతున్న సమయంలో సౌమ్య వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. తాను బహిర్భూమికి వెళ్లిన సమయంలో తమ గ్రామానికి చెందిన సతీష్, రమేష్‌ బలవంతం చేశారని, తాను ఎంత గింజుకున్నా, వదలి పెట్టక ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారని సౌమ్య ఇచ్చిన వాంగ్మూలంతో ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు అయింది. అయితే, ఆ గ్రామంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగడంతో కేసును తుంగలో తొక్కేందుకు తొలుత పోలీసులు ప్రయత్నించారు. తాజాగా ఆ బాలిక మరణంతో లైంగిక దాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆదివారం వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు, మహిళా, ప్రజా సంఘాలు ఏకంఅయ్యాయి.

నిందితుల్ని అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగాయి. సౌమ్య మరణానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదంటూ కుటుంబీకులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇక, నిందితుల్ని వెనకేసుకు వస్తున్న చిక్లింగ్‌మలై గ్రామంలోని కొందరు  పోలీసులు, అధికారులు ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. రోడ్ల మీద చెట్లను నరికి పడేయడం గమనార్హం. బాధితురాలికి మద్దతుగా మహిళాలోకం కదలడంతో ఆ పెద్దలు వెనక్కుతగ్గారు. నిందితుల అరెస్టుకు పట్టబడుతూ సంఘాలు రోడ్డెక్కడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులే నిందితుల్ని రక్షిస్తున్నారని, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు తనకు ఫోన్‌చేసి మరీ బెదిరిస్తున్నారని బాధితురాలి తండ్రి అన్నామలై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ఆరో తేదీన తాను ఒట్టపాడి పొలీసు స్టేషన్‌కు సమాచారం అందిస్తే, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎవర్నో రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడి జరిగిన విషయాన్ని బయటకు చెప్పవద్దంటూ బెదిరించిన వాళ్లూ ఉన్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. తన బిడ్డ మరణానికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. సౌమ్య మరణం వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో జిల్లా కలెక్టర్‌ మలర్‌ విళి, ఎస్పీ మహేశ్‌కుమార్‌ రంగంలోకి దిగారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ కుటుంబాన్ని బుజ్జగించే పనిలో పడ్డారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పీఎంకే నేత, ధర్మపురి ఎంపీ అన్భుమణి రాందాసు మాట్లాడుతూ నిందితుల్ని తక్షణం అరెస్టు చేయాలని, వారి వెనుక ఎంతటి శక్తులు ఉన్నా వదలి పెట్టకూడదని డిమాండ్‌చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top