రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి

A Girl Died Of Snake Bite In Gara Srikakulam - Sakshi

పాముకాటుకు విద్యార్థి మృతి

సకాలంలో అంబులెన్స్‌ రాలేని దైన్యం

కన్నీరుమున్నీరైన కుటుంబీకులు

సాక్షి, శ్రీకాకుళం: తాము పడుతున్న కష్టాలు తమ బిడ్డకు రాకూడదని ఆ తల్లిదండ్రులు భావించారు. అనుకున్నట్టుగానే తమ కుమార్తె బాగా చదువుకోవాలని తన తాతగారింటికి పంపించేశారు. అయితే విధి వక్రించి పాము రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. అయితే సకాలంలో 108 వాహనం వచ్చేందుకు గ్రామ రోడ్డు బాగులేకపోవడంతో పాపను కోల్పోయామని కుటుంబీకులు బోరుమన్నారు. ఈ విషాద ఘటన గార మండలం శ్రీకూర్మం చినముద్దాడపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన అమ్మమ్మ బాడితమంతి జయలక్ష్మి, తాతయ్య పైడయ్య వద్ద ఉంటున్న ఒనుము పద్మావతి (11) శ్రీకూర్మంలోని బాలికల పాఠశాలలో ఆరో తరగతి  చదువుతోంది. కల్లుగీత కార్మికులైన చిన్నారి తల్లిదండ్రులు ఒనుము రమణ, సుజాత అదే మండలం ఆలింగపేటలో ఉంటున్నారు. వీరి కష్టాన్ని చూడకూడదని భావించి అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో పద్మావతితోపాటు అమ్మమ్మ, తాతయ్య, మరో బంధువు కలిసి నేలపై నిద్రిస్తున్నారు.

వరి పొలాలకు దగ్గర్లో పాకలో నివాసముంటున్న వీరిలో బాలికను గుర్తు తెలియని విషసర్పం కాటువేసింది. అప్పటికే ఏదో కుట్టినట్లు అనిపించడంతో పాప వెంటనే లేచి అమ్మమ్మ, తాతయ్యలకు చెప్పింది. నల్లటి ఛారలతో తెల్లటి మచ్చల పాము కరిచినట్టుగా గుర్తించి వెంటనే అంబులెన్స్‌ ద్వారా రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గార ఎస్‌ఐ లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సకాలంలో అంబులెన్స్‌ వచ్చి ఉంటే..
గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం పాప మృతికి అద్దం పడుతోంది. రోడ్ల కోసం మంజూరైన నిధులను దుర్వినియోగం చేసారన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరైన రోడ్లు వేయకపోవడంతో బాలిక చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. వాస్తవంగా ముద్దాడపేట గ్రామం లూప్‌లైన్‌ కావడంతో అంబులెన్స్‌ వచ్చేసరికి గంటకుపైనే సమయం పట్టింది. పొరపాటున వర్షం పడితే మాత్రం అంబులెన్స్‌ కాదు కదా.. కనీసం ఆటో కూడా వచ్చే పరిస్థితి లేదు. 
మృతదేహాన్ని పరిశీలిస్తున్న గార ఎస్‌ఐ   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top