పెళ్లంటూ యువతికి... కారంటూ మహిళకు!

Fraud Cases Filed on Cyber Criminals Hyderabad - Sakshi

ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్ల టోకరా  

ఇరువురి నుంచి రూ.4.96 లక్షలు స్వాహా

కేసులు నమోదు  

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు అదును చూసుకుని రెచ్చిపోతూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో, మరో మహిళకు కారు విక్రయమంటూ మోసం చేశారు. రూ.4.96 లక్షలు మోసపోయిన ఇరువురూ నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగిని తన ప్రొఫైల్‌ను జీవన్‌సాథి.కామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. కొన్ని రోజుల తర్వాత దాని ద్వారానే రిషికుమార్‌ నేలపాటి అనే యువకుడు ఆమెకు రిక్వెస్ట్‌ పంపించాడు. నెల్లూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు.వివాహం చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇరువురు వెబ్‌సైట్‌ ద్వారానే సంప్రదింపులు జరుపుకున్నారు. ఇద్దరూ తమ ఫొటోలు, ఫోన్‌ నెంబర్లు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు.

వీడియో చాటింగ్‌కు రావాలంటూ ఆమె ఎన్నిసార్లు కోరినా అతడు దాటవేసేవాడు. కొన్నాళ్లకు అసలు కథ మొదలెట్టిన అతగాడు తన తల్లి క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, వైద్య ఖర్చుల కోసం అత్యవసరంగా నగదు కావాలని, మీ క్రెడిట్‌ కార్డు వివరాలు పంపిస్తే వాటి ఆధారంగా ఇక్కడ బిల్లు చెల్లించిన తర్వాత వీలు చూసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె తన క్రెడిట్‌ కార్డును ఫోటో తీసి వాట్సాప్‌ చేసింది. పిన్‌ నెంబర్‌ సైతం అడిగి తెలుసుకున్న అతను దాని ఆధారంగా రూ.రెండు లక్షలు వాడుకున్నాడు. ఆ తర్వాత మరోసారి ఆమె డెబిట్‌ కార్డు వివరాలు తీసుకొని రూ. 40 వేలు కాజేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మాట్రిమోనియల్‌ సైట్‌లోని తన ప్రొఫైల్‌ను బ్లాక్‌ చేశాడు. ఆమె అదే సైట్‌లో వెతుకుతుండగా.. మరోచోట రిషికుమార్‌ అనే పేరుతో ప్రొఫైల్‌ కనిపించడంతో అందులో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఎందుకు కొత్త ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశావని నిలదీసింది. సాంకేతిక సమస్యలతో కొత్త ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయాల్సి వచ్చిందని చెప్పిన అతడు మరో కొత్త ఫోన్‌ నెంబర్, పేటీఎం నెంబర్‌ ఇచ్చాడు. ఈ వివరాలను ఆమె ‘ట్రూ కాలర్‌’లో పరిశీలించగా జీవన్‌కుమార్‌ అని వస్తుండడంతో అనుమానించింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో అతగాడు సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌చేశాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

పార్కింగ్‌ ఫీజు పేరుతో రూ.2.56 లక్షలు
ఓఎల్‌ఎక్స్‌లో హై ఎండ్‌ కారు విక్రయం ప్రకటన చూసిన ఓ మహిళ రూ.2.56 లక్షలు మోసపోయింది. ఈమె నుంచి సైబర్‌ నేరగాళ్లు పార్కింగ్‌ ఫీజు పేరుతో ఆ మొత్తం కాజేశారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన షమా బైక్‌ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలను పరిశీలిస్తుండగా మహీంద్ర కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ వాహనం కేవలం రూ.6.50 లక్షలకు విక్రయానికి ఉండటాన్ని చూసి ఆమె ఆకర్షితురాలైంది. దీంతో ప్రకటనలో ఉన్న ఫోన్‌ నంబర్‌ను సంప్రదించింది. కారు యజమానిగా పేర్కొన్న ఫెలిసీయాతో బేరం ఆడి రూ.5.50 లక్షలకు ఖరాదు చేసుకుంది. యజమానిగా చెప్పుకున్న వ్యక్తి ఆ కారు శంషాబాద్‌ విమానాశ్రయం పార్కింగ్‌ ప్లేస్‌లో ఉందని చెబుతూ అక్కడ కార్గో విభాగం జీఎం అనుసింగ్‌తో మాట్లాడాలని సూచిస్తూ మరో ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు.

దీంతో ఆమె సదరు ఫోన్‌ నెంబరును సంప్రదించగా  విమానాశ్రయంలో కారు పార్కింగ్‌ ఫీజు, నిర్వహణ ఫీజు, సెక్యురిటీ ఫీజు కింద కొంత బకాయి ఉందని, రూ.2.56 లక్షల చెల్లిస్తే రిలీజ్‌ లెటర్‌ ఇస్తామని తెలిపారు. అయితే డబ్బును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొంటూ రాహూల్‌ కుమార్‌ శర్మ పేరున ఉన్న సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతా నంబర్‌ ఇచ్చారు. దీంతో షమా రెండు దఫాల్లో రూ.2.56 లక్షలు ఆయా ఖాతాల్లో జమ చేసి అనుసింగ్‌కు ఫోన్‌ చేసింది. అయితే మీరు విమానాశ్రయానికి వస్తే మీకు కారు రిలీజ్‌ ఆర్డర్‌ ఇస్తానంటూ చెప్పింది. ఈ ఉత్తర్వులు ఉంటే కారు తీసుకువెళ్లవచ్చని, మిగిలిన మొత్తం ఫెలిసీయాకు ఇవ్వాలని సూచించింది. దీంతో షమా తన కుమారుడిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పంపగా, అక్కడికి వెళ్లిన అతను సదరు కారు కోసం ఆరా తీయగా... అలాంటిది లేదని తేలింది. దీంతో ఫెలిసీయా, అనుసింగ్‌ల ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయగా... స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top