గీసుకొండలో విషాదం! 

Four People Deceased Under Suspicious At Geesugonda - Sakshi

బావిలో నలుగురి మృతదేహాలు

మృతుల్లో దంపతులు, కుమార్తె, మనవడు

ఆత్మహత్యా, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

గీసుకొండ(పరకాల): పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చింది ఆ కుటుంబం.. గోనెసంచులు కుట్టుకుంటూ పొట్టపోసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఏ కష్టం వచ్చిందో కానీ భార్యాభర్తలతో పాటు కన్న కూతురు.. మనవడితో సహా తనువు చాలించారు. ఓ బావిలో శవాలై తేలారు.. పశ్చిమ బెంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన కుటుంబం.. చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ జీవనం సాగిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ గోనెసంచులు కుట్టే కేంద్రం పక్కన ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాలు గురువారం వెలుగు చూశాయి.

మృతుల్లో మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), ఆయన భార్య నిషా ఆలం (48), వారి కుమార్తె బుషారా ఖాతూన్‌ (20)తో పాటు మూడేళ్ల మనవడు ఉన్నారు. మక్సూద్‌తో పాటు ఆయన భార్య గోనె సంచులు కుట్టే దినసరి కూలీలుగా పని చేస్తోంది. మక్సూద్‌కు భార్య, కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు, మనవడు ఉన్నారు. మక్సూద్‌ కుటుంబం పశ్చిమ బెంగా ల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వరంగల్‌లోని కరీమాబాద్‌ ప్రాంతానికి వచ్చి అద్దె గదిలో ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి గొర్రెకుంట శివారు ప్రాంతానికి వచ్చివెళ్లే సదుపాయం లేకపోడంతో రెండు నెలలుగా గోనెసంచుల కేంద్రంలోనే తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీరితో పాటు బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు అదే కేంద్రంలో నివాసం ఉంటూ గడిచిన 20 రోజుల నుంచి పని చేస్తున్నారు.

ఆ నలుగురు ఎటు వెళ్లారు?  
మక్సూద్‌తో పాటు ఆయన భార్య, కూతురు, మనవడు బావిలో శవాలై తేలగా.. వారి కుటుంబంలో ఇద్దరు కుమారుల ఆచూకీ లేకుండా పోయింది. వారు ఎక్కడికి వెళ్లారనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఇద్దరు బిహారీ కార్మికులు శ్యాం, శ్రీరాం కూడా లేకుండా పోయారు. వారి ఫోన్‌లు స్విచాఫ్‌ వస్తుండడం గమనార్హం. ఈ నలుగురి ఆచూకీ తెలిస్తే కానీ బావిలో శవాలై తేలిన వారు ఎలా మృతి చెందారనే విషయం తేలనుంది. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం కూడా ఈ కేసు విషయంలో అస్పష్టత కారణమైంది.

నలుగురిని ముందే చంపి మృతదేహాలను బావిలో పడవేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దరాప్తు చేస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని వరంగల్‌ పోలీసు కమిషరేట్‌ ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్లు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్సైలు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో పో లీస్‌ «అధికారులు ఓ అంచనాకు రాలేకపోయారు.

విషయం తెలిసింది ఇలా.. 
గోనెసంచుల కేంద్రంలో నిల్వ ఉన్న సంచులను తీసుకుని రావాలని సాయిదత్తా ట్రేడర్స్‌కు చెందిన భాస్కర్‌ ఓ ఆటో డ్రైవర్‌ను అక్కడికి పంపాడు. గురువారం ఉదయం 7 గంటలకు ఆయన వెళ్లి చూడగా అతడికి ఎవరూ కనిపించలేదు. ఈ మేరకు భాస్కర్‌ తన పార్ట్‌నర్‌ సంతోష్‌తో కలసి కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడ చూస్తే మక్సూద్‌ కుటుంబం, బిహారీ కార్మికులు ఎవరూ వారికి కనిపించలేదు. దీంతో పనిపై బయటకు వెళ్లి ఉంటారని భావించారు. ఆ తర్వాత కొంత సమయానికి తిరిగి వచ్చిన బిహారీ కార్మికులు భవనంపైకి ఎక్కిచూడగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలి ఉండటాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను గురువారం సాయంత్రం బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

విచారణ చేపడుతున్నాం.. 
నలుగురు బావిలో శవమై తేలిన కేసు విషయంలో ఆధారాలు లభించాల్సి ఉందని అదనపు డీసీపీ వెంకటలక్ష్మి గురువారం రాత్రి తెలిపారు. మృతుడు మక్సూద్‌ ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు ఆ బహారీ కార్మికుల ఆచూకీ కోసం పోలీస్‌ బృందాలతో గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, బీహారీలు ఉంటు న్న గదిలో వారికి సంబంధించిన అన్ని వస్తు వులు అలాగే, ఉన్నాయని ఆమె తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top