కిడ్నాప్‌ కేసులో నిందితుల అరెస్ట్‌

Four Men Arrest in Kidnap Case Hyderabad  - Sakshi

రాంగోపాల్‌పేట్‌: యువకుడి కిడ్నాప్‌ కేసులో ఐదురుగు నిందితులను గోపాలపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. మరో ఘటనలో యువతిని వేధిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. శుక్రవారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కే శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మల్కాజ్‌గిరికి చెందిన పుల్లూరి దివ్య (24) విప్రో కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె స్నేహితురాలు ప్రవళిక బోరబండలో ఉంటోంది. ప్రవళిక ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన నరసింహాచారి, అతడి కుమారుడు సాయి కుమార్‌ కార్పెంటరీ పని చేశారు. ఇంకా కొద్దిగా పని మిగిలి ఉండటంతో ప్రవళిక నరసింహాచారి, అతడి కుమారుడు సాయికి ఫోన్‌ చేయగా వారు స్పందించడం లేదు. దీంతో అదే సమయంలో ప్రవళిక ఇంటికి వెళ్లిన దివ్య ఫోన్‌ నుంచి సాయికి ఫోన్‌ చేసింది. ఆ తర్వాత ట్రూ కాలర్‌ ఆధారంగా దివ్య నంబర్‌గా గుర్తించిన సాయి దానిని సేవ్‌ చేసుకున్నాడు.

అప్పటి నుంచి తరచూ ఆమెకు ఫోన్‌ చేసి ప్రేమిస్తున్నాని చెబుతూ, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో  సాయికుమార్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న దివ్య తన స్నేహితుడు ఓల్డ్‌ మిర్జాలగూడకు చెందిన రోహిత్‌కు చెప్పింది. అతను ఉప్పరగూడకు చెందిన విజయ్‌కుమార్‌ , రాజ్‌నగర్‌కు చెందిన శశిధర్, ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌కు చెందిన అజయ్‌కుమార్, మిర్జాలగూడకు చెందిన నరేష్‌కుమార్‌కు విషయం చెప్పాడు. ఆరుగురు కలిసి సాయికుమార్‌ను కిడ్నాప్‌ చేయాలని నిశ్చయించుకున్నారు. పథకంలో భాగంగా శుక్రవారం ఉదయం దివ్య సాయికి ఫోన్‌ చేసి సెయింట్‌ మేరీస్‌ కాలేజీ వద్దకు పిలిపించింది. మ«ధ్యాహ్నం అక్కడికి వచ్చిన సాయిని దివ్యతో పాటు అక్కడికి చేరుకున్న ఆమె స్నేహితులు సాయికుమార్‌పై దాడి చేయడమేగాక బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మిర్జాలగూడ, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి చితకబాదారు. వారి బారి నుంచి తప్పించుకున్న సాయికుమార్‌ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి నుంచి అందిన సమాచారంతో గోపాలపురం పోలీసులు అక్కడికి వెళ్లి బాధితునుంచి వివరాలు సేకరించారు. దివ్యను ఫోన్‌లో వేధించినట్లు సాయికుమార్‌ అంగీకరించాడని, ఆమె ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 

నాలుగు బృందాలుగా వేట..
సాయికుమార్‌పై దాడిని గుర్తించిన స్థానికులు 100 డయల్‌ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన బైక్‌ నంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారిలో  విజయ్‌కుమార్‌ పరారీలో ఉండగా మిగతా నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. రెండు బైక్‌లు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top