సిగరెట్‌ తాగడానికి కారు ఆపాడు.. ఇంతలో..

Five Star Hotel Manager Robbed In Gurugram - Sakshi

గురుగ్రామ్‌ : సిగరేట్‌ తాగడానికి రోడ్డుపక్కన కారు ఆపిన ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ మేనేజరన్‌ను బంధించి దోపిడీ చేశారు. ఐదు గంటల పాటు అతన్ని ఇబ్బందులకు గురిచేసి ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కారుతో ఉడాయించారు. ఈ సంఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌కు చెందిన కబీర్‌ అలీ(27) సెక్టార్‌ 29లోని ది ప్లాజియోలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో విధులకు వెళ్లడానికి తన ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారులో బయలుదేరాడు. పనివేళల్లో సిగరేట్‌ తాగకూడదన్న నియమంతో హోటల్‌కు చేరుకోవటానికి కొద్దిదూరంలో కారును ఆపి సిగరేట్‌ వెలిగించాడు. అక్కడ వీధిలైట్లు సరిగ్గా పనిచేయని కారణంగా చీకట్లు అలుముకున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో తుపాకి పట్టుకుని కారు దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి చేతిలో తుపాకి ఉన్న సంగతి అలీ గమనించకుండా దుండగుడు డోర్లు అన్‌లాక్‌ చేయమనగానే చేశాడు.

దీంతో మరో దుండగుడు వెంటనే అలీ పక్కసీటులో వచ్చి కూర్చున్నాడు. గన్ను ఉన్న వ్యక్తి డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న అలీని కొట్టి అతడి సీటును అక్రమించాడు. కొద్ది సేపటి తర్వాత ఇద్దరూ అలీ చేతుల్ని కట్టేసి, అతడి ముఖాన్ని స్వెటర్‌ కప్పివేసి వెనకాలి సీటులో కూర్చోబెట్టారు. ఆ దుండగులిద్దరూ కారును అక్కడినుంచి కొద్దిదూరం తీసుకురాగా మరో ఇద్దరు వాళ్లతో కలిశారు. అలా కొద్దిదూరం పోయిన తర్వాత అలీని బెదిరించి అతడి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌, డబ్బు, ఏటీఎం కార్డులను తస్కరించారు. ఏటీఎం కార్డులలో డబ్బులు లేవని ధ్రువీకరించుకున్న తర్వాత అతన్ని ఐదు గంటల పాటు కారులో తిప్పి ఓ చోట దింపి, కారుతో ఉడాయించారు. అలీ పోలీసులకు ఫోన్‌ చేయాలనే ఉద్ధేశ్యంతో వాళ్లు వదిలి వెళ్లిన ప్రాంతం నుంచి హోటల్‌వైపుగా నడవటం ప్రారంభించాడు. చిమ్మ చీకట్లో రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న అలీని చూసిన పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. దీంతో తనను దోచుకున్న తీరును వారికి వివరించాడు. అలీని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు  అతడి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top