దాడి కేసులో నిందితుల అరెస్ట్‌

Five Members Arrest in Robbery Case - Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌లో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను అడ్డుకుని దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోపే వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్న ఐదురుగు నిందితులను మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌కు చెందిన  సాయి, అతడి సోదరుడు కృష్ణ మాదాపూర్‌లోని ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి వారు పని ముగించుకొని బైక్‌పై ఇందిరానగర్‌లోని తమ ఇంటికి వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన సుతార్‌ మహేష్‌ అలియాస్‌ మహి, సురేష్, సాయితేజ్‌ అనే వ్యక్తులు సమీపంలోని మైదానంలో మద్యం సేవించి మత్తులో తూలుకుంటూ ఇంటికి వెళ్తున్నారు.

రిచ్‌మండ్‌ స్కూల్‌ వద్ద బైక్‌పై వెళుతున్న సాయి, కృష్ణలను అడ్డుకున్న వీరు అంత స్పీడ్‌ ఎందుకని ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరగడంతో ముగ్గురూ కలిసి వారిపై దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న సాయి, కృష్ణ తమ ఇంట్లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహేష్‌ సోదరుడు రాకేష్‌  ఏం జరిగిందని ప్రశ్నించాడు. విషయం తెలుసుకున్న రాకేష్‌ తన స్నేహితులు నవీన్, మల్లేష్, ప్రవీణ్‌లకు ఫోన్‌ చేసి పిలిపించాడు. నవీన్‌ ఇంట్లో నుంచే కత్తి తీసుకొని రాగా సురేష్, సాయితేజ్, మల్లేష్, ప్రవీణ్‌లు కర్రలు, రాడ్లు, రాళ్లతో సాయి ఇంటికి దాడి చేశారు. మహేష్‌ బీరు సీసాలు పగలగొట్టి అడ్డు వచ్చిన సాయి స్నేహితుడు నిషాంత్‌ తలపై మోదడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న మహేష్, సురేష్, సాయితేజ్, మల్లేష్, ప్రవీణ్, రాకేష్, నవీన్‌ తదితరులు అడ్డు వచ్చిన వారిపై దాడి చేశారు.

పోలీసులు వచ్చేసరికే అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మహి, సురేష్, సాయితేజ్, నవీన్, రాకేష్‌లను అరెస్ట్‌చేశారు. మల్లేష్, ప్రవీణ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి న బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top