కోదాడలో ఘోర ప్రమాదం

Five killed, several injured in kodada road accident - Sakshi

ఏడుగురు దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు

ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆటో

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివార్లలో ఘటన

ఆటోడ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

రాములవారి కల్యాణానికి వెళ్లొస్తుండగా..

సాక్షి, కోదాడ: పండగరోజు సీతారాముల కల్యాణం చూసిన ఆనందం అంతలోనే ఆవిరైంది. కల్యాణం చూసి ఇంటికి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొద్దిసేపట్లో గమ్యస్థానం చేరుకోనుండగా.. ఆటోడ్రైవర్‌ నిర్లక్ష్యం ఏడు ప్రాణాలను బలిగొంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని ఖమ్మం–కోదాడ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 3:18 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతిఏటా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు కోదాడకు చెందిన భక్తులు వెళ్లివస్తారు. ఈసారి కూడా పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వెనకున్న సిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మహిళలు తమ్మర దేవాలయంలో సీతారామ కల్యాణానికి వెళ్లారు. 

కార్యక్రమం పూర్తయ్యాక అక్కడి నుంచి ఆటోలో కోదాడకు బయలుదేరారు. వీరితో పాటు కోదాడకు చెందిన మరో ఐదుగురు ఆటోలో ఎక్కారు. డ్రైవర్‌తోపాటు మొత్తం ఆటోలో 10మంది ఉన్నారు. ఖమ్మం క్రాస్‌ రోడ్డు సమీపంలోకి రాగానే.. ముందున్న బస్సును ఆటోడ్రైవర్‌ ఓవర్‌టేక్‌ చేసేప్రయత్నంలో.. అకస్మాత్తుగా రోడ్డు ఎడమవైపు నుంచి కుడివైపునకు వచ్చాడు. అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మంకు సిమెంట్‌ లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (60) ఆయన భార్య బేతు నాగసులోచన (57), తమ్మరకు చెందిన ఆటోడ్రైవర్‌ అబ్బాస్‌ (48), పట్టణంలోని మాతానగర్‌కు చెందిన నరిమినేని సుగుణమ్మ (45), గుండపనేని పద్మ (56) అక్కడికక్కడే మృతి చెందారు. సిరి అపార్టుమెంట్‌కు చెందిన అంబటి సైదమ్మ (38), వటికొండ శైలజ (40)లు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. అయితే తీవ్రమైన గాయాలతో వీరు మార్గమధ్యంలోనే మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు మహిళలు లక్ష్మి, రేణుక, మంగతాయారు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వీరు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాక్‌కు గురైన వీరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు.

ఘటనా స్థలం రక్తసిక్తం
కోదాడ – ఖమ్మం రోడ్డుపై ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనాస్థలి రక్తసిక్తంగా మారింది. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొనడంతో.. ఆటో నుజ్జునుజ్జయింది. మృతుల్లో నలుగురు ఆటోలోనే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జనావాసాలకు సమీపంలోనే ఘటన జరగడంతో స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను బయట తీసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ముగ్గురిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏడుగురి మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 

మృత్యువులోనూ వీడనిబంధం
కోదాడ పట్టణానికి చెందిన బేతు లక్ష్మయ్య, నాగ సులోచన దంపతుల బంధం మృత్యువులో వీడలేదు. ఆదివారం తమ్మర దేవాలయానికి వెళ్లిన వీరు స్వామివారి కల్యాణం పూర్తి అయిన తరువాత అక్కడే భోజనం చేసి కోదాడకు బయలుదేరారు. కోదాడకు ఒకటి రెండు నిమిషాల్లో చేరుకొనే లోపే మృత్యువాత పడ్డారు. వీరిద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. లక్ష్మయ్య పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు.

మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం
సూర్యాపేట ప్రమాదం విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా కల్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌ వంటిపులి అనిత.. వైద్యశాలలకు వచ్చి బాధిత కుంటుంబాలను ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top