పక్కా 420!

Film Producer Basheed Arrest in Cheating Case - Sakshi

బషీద్‌ చిల్లర వేషాలు ఎన్నో  

మోసాలు చేయడంలో దిట్ట

2005 నుంచి నేరాలు  పట్టుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: బోగస్‌ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, రుణాలు ఇప్పిస్తానంటూ అడ్వాన్సులు దండుకోవడం, సినిమాల్లో అవకాశాల పేరుతో అందినంత దోచుకోవడం, ఈ పంథాలో రెచ్చిపోతూ వరుస మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు, సినీ నిర్మాత షేక్‌ బషీద్‌ను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2005 నుంచి అతడికి నేరచరిత్ర ఉందని, ఇప్పటి వరకు పదికి పైగా కేసులు నమోదైనట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు.   గుంటూరు జిల్లా, వేజెండ్లకు చెందిన బషీద్‌ అలియాస్‌ బాసిత్‌ బీకాం చదివాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు నగరానికి వచ్చిన ఇతను బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో బిల్డర్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫైనాన్స్‌ సంస్థలను ఏర్పాటు చేశాడు. ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయిల్లోనూ వ్యాపారాన్ని విస్తరించాడు. చిత్ర రంగంలోనూ అడుగుపెట్టిన ఇతగాడు నగరంతో పాటు చెన్నైలోనూ వాటిని నిర్మించడం, సినిమా నిర్మాణాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే 2005 నుంచి బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఇతడిపై క్రిమినల్‌ కేసులు నమోదవుతుండటం మరో ఎత్తు.

నగర నేర పరిశోధన విభాగంలోనూ (సీసీఎస్‌) మరికొన్ని కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికం బోగస్‌ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేయడానికి సంబంధించినవే. ఇటీవల తన సంస్థలో ఉద్యోగినులను మాత్రమే నియమించుకున్న బషీద్‌ మరో తరహా మోసాలకు తెరలేపాడు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి తక్కువ వడ్డీకి భారీ మొత్తంలో రుణాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపి సంప్రదించిన వారితో మాట్లాడే ఉద్యోగినులు ఇతర రాష్ట్రాలు, దేశంలో ఉన్న ఎస్‌బీకే గ్రూప్‌ వ్యాపార, వ్యవహారాలను ఏకరువు పెట్టి నమ్మిస్తారు. ఆపై వారి నుంచి నేరుగా, లేదా మెయిల్‌ ద్వారా స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు తీసుకుంటారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రుణం మంజూరుకు సిద్ధంగా ఉందని చెబుతూ కొంత మొత్తం చెల్లించాలంటారు.

ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్, చలాన్‌ ఫీజుల పేరుతో తన ఖాతాల్లో డబ్బు జమ చేయించుకుంటారు. ఆపై వారు ఫోన్‌ చేస్తే స్పందించకపోవడం, నేరుగా కార్యాలయానికి వస్తే బెదిరింపులకు పాల్పడటం బషీద్‌ నైజం. ఈ ఏడాది జూన్‌లో కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఎస్‌.పానకాలరావు బషీద్‌ను సంప్రదించి, తనకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు రుణం కావాలని కోరాడు. ఇప్పిస్తానని నమ్మించిన బషీద్‌ రూ.65 లక్షలు కాజేశాడు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఇతడి కార్యాలయానికి వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన  గురవయ్య రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల రుణం కోరాడు. అంతా అయిపోయిందని చెప్పిన బషీద్‌ అతడి నుంచి రూ.32.5 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఈ ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ, నగరంలోని బంజారాహిల్స్‌ ఠాణాల్లో చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బషీద్‌ను పట్టుకోవడానికి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎండీ ముజఫ్ఫర్‌ అలీ, ఎన్‌.రంజిత్‌కుమార్‌లతో కూడిన బృందం ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం  బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. 

ఆ నిర్మాత జీవితం నేరాల మయం...
బషీద్‌ నిర్మాతగా ‘అల్లరే అల్లరి’, ‘మెంటల్‌ పోలీస్‌’, ‘నోటుకు పోటు’, ‘ఫైర్‌’ సహా తొమ్మిది చిత్రాలు నిర్మించారు. ‘ధడ్కన్‌’ అనే హిందీ సినిమాను ‘రామ్‌దేవ్‌’ పేరుతో తెలుగులో రీ–మేక్‌ చేశారు. మరో నాలుగింటికి సహనిర్మాతగా ఉంటంతో పాటు ‘ఎవడ్రా హీరో’ చిత్రంలో హీరో పాత్రను పోషించాడు. సినీ జీవితం ఇలా ఉంటే...  వాస్తవ జీవితం మాత్రం నేరాలమయం. అతడి స్వస్థలమైన గుంటూరు జిల్లా, తెనాలితో పాటు ఆమ్రాబాద్‌ల్లోనూ కేసులు నమోదయ్యాయి.  తెనాలి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 1999 జూన్‌ 2న రౌడీషీట్‌ సైతం ఓపెన్‌ చేశారు. ఆపై ఇది క్లోజ్‌ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతడిపై నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో పదికి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

హిమాయత్‌నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.2 కోట్లు రుణం తీసుకుని మోసం చేయడంతో 2014లో కేసు నమోదైంది. బజ్జు ఎర్త్‌ మూవర్స్‌ అంటూ బోగస్‌ సంస్థ ఏర్పాటు చేసిన బషీద్‌ దీని ముసుగులో జూబ్లీహిల్స్‌ సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి రూ. 65 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీనికి సంబంధించి 2010లో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్‌బీఎస్సీ బ్యాంకును రూ.70 లక్షల మేర మోసం చేయడంతో 2012లో రెండు కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.70 లక్షలు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ.35 లక్షలు బషీద్‌కు ‘సమర్పించుకున్నాయి.’ వీటితో పాటు మరికొన్ని మోసాలకు సంబంధించిన కేసులూ బషీద్‌పై నమోదయ్యాయి. 2005 నుంచి ఇతడి నేరచరిత్ర, ఇప్పటికే పలుమార్లు అరెస్టు కావడం తదితరాలను పరిగణలోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పెండింగ్‌లో ఉన్న నాన్‌–బెయిలబుల్‌ వారెంట్ల వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని, ఆ సందర్భంగా పూర్తి నేరచరిత్రను ఆరా తీస్తామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top