కటకటాల్లో మానవ మృగం

Father Molestation On Daughter From Three Years In Chittoor - Sakshi

కన్నకూతురిపై మూడేళ్లుగా అత్యాచారం చేసిన దుర్మార్గుడు

సహకరించిన తల్లిని సైతంఅదుపులోకి తీసుకున్న పోలీసులు

వావివరసలు మరచి కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి సహకరించిన భార్యనూ అరెస్టు చేశారు.

చిత్తూరు, చంద్రగిరి: మూడేళ్లుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రితో పాటు అతనికి సహకరించిన తల్లిని సైతం పోలీసులు కటకటాల్లోకి పంపారు. ఆదివారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సీఐ సురేంద్ర నాయుడు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండల ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ఓ జీపు డ్రైవరుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల్లో బీకాం కంప్యూటర్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోందన్నారు. మూడేళ్లుగా ఆ యువతిపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారు. మద్యానికి బానిసైన అతను మూడేళ్ల ముందు యువతిపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు.

యువతి వ్యతిరేకించడంతో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిపారు. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పోషణ భారమవుతుందన్న ఉద్దేశంతో వారు ఎవరికీ చెప్పుకోలేదని తెలిపారు. గ్రామంలో ఈ విషయం కొంతమందికి తెలిసినా అతను చేసే దౌర్జన్యాలకు భయపడి, మిన్నుకుండిపోయారన్నారు. దీంతో అతను మూడేళ్లుగా యువతిపై అత్యాచారం చేస్తూ వచ్చాడని తెలిపారు. చివరకు తన తండ్రి చేసే అఘాయిత్యాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. తన దూరపు బంధువుకు తన ఆవేదన చెప్పడంతో ఆమె సూచనల మేరకు ధైర్యం చేసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో నిందితులను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయన్నారు. తన కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు అతడు అంగీకరించినట్లు తెలిపారు. 

నిందితుడి నుంచి తగిన సాక్ష్యాలను సేకరించడం జరిగిందన్నారు. బాధిత యువతిని మెడికల్‌ పరీక్షల అనంతరం తిరుపతిలోని ఓ హోంకు తరలించినట్లు తెలిపారు. కాగా నిందితుడి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తన అత్తను సైతం హతమార్చినట్లు తెలిసిందన్నారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు చిరంజీవి, సురేష్‌ కుమార్, ఏఎస్‌ఐ దేవదత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top