నిద్రలోనే హతమార్చిన కసాయి తండ్రి

Father Killed Son In Deep Sleep In PSR Nellore - Sakshi

నెల్లూరు (క్రైమ్‌): చదువుకుంటానన్న కుమారుడిని మానేసి ఏదైనా పని చేసుకోమని చెప్పినా, తాను చెప్పిన మాట వినలేదని ఓ కసాయి తండ్రి కన్న బిడ్డను నిద్రలోనే హతమార్చాడు. కుమారుడిని హత్యచేసి పరారైన ఘటన శనివారం రాత్రి బాలాజీనగర్‌లో జరిగిన విషయం విదితమే. నిందితుడని బాలాజీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విడవలూరు మండలం అలగానిపాడుకు చెందిన పూసపాటి సుబ్రహ్మణ్యం, సరోజ దంపతులు. వీరికి సుకుమార్‌ (19), సాద్విక్‌ పిల్ల లు. వివాహానంతరం వారు బతుకు దెరువు నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. బాలాజీనగర్‌ సరస్వతీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం ఆర్‌ఆర్‌ స్ట్రీట్‌లో కూల్‌డ్రింక్‌షాపు నిర్వహిస్తుండగా, సరోజ బాలాజీనగర్‌లో ఓ వస్త్ర దుకాణంలో, రెండో కుమారుడు సాద్విక్‌ నగరంలోని గణేష్‌ మెస్‌లో పనిచేస్తున్నాడు.

పెద్దకుమారుడు సుకుమార్‌ చెన్నైలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. వ్యసనాలకు బానిసైన సుబ్రహ్మణ్యం సంపాదన మొత్తం ఖర్చు చేస్తున్నాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలున్నాయి. పది రోజుల కిందట సుకుమార్‌ కళాశాలకు సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. తృతీయ సంవత్సరం కోసం కళాశాలలో ఫీజు కట్టేందుకు తండ్రిని డబ్బులు అడగ్గా ఆయన పట్టించుకోలేదు. దీంతో సుకుమార్‌ బ్యాంక్‌ లోను కోసం ప్రయత్నిస్తున్నాడు.   సుబ్రహ్మణ్యం తన కుమారుడిని చదువు మానివేసి ఏదో ఒక పనిచేసుకోవాలని లేదంటే అంతు చూస్తామని బెదిరించాడు. ఈ విషయమమై తండ్రి కుమారుల నడుమ వివాదం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం తన కూల్‌డ్రింక్‌ షాపులోని సామాన్లన్నింటిని అమ్మివేసి మద్యం మత్తులో మునిగి తేలుతూ ఇంటికి కూడా రావడం లేదు. రెండు రోజుల కిందట సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చాడు. సామాన్లు అమ్ముకొన్న విషయమై భార్య నిలదీసింది.

దీంతో ఆమెపై దాడి చేయడంతో కుమారులు అడ్డుకొన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సుబ్రహ్మణ్యం ఈనెల 25వ తేదీ కుమారుడి  సర్టిఫికెట్లను చించివేశాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఈ నెల 26వ తేదీ శనివారం సుబ్రహ్మణ్యం, అతని పెద్ద కుమారుడి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటికి వివాదం సద్దుమణగడంతో సరోజ ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న షాపుకు వెళ్లింది. సాద్విక్‌ సైతం మెస్‌కు వెళ్లాడు. ఇంట్లో సుబ్రహ్మణ్యం, సుకుమారులు మరోమారు గొడవపడ్డారు. దీంతో ఉన్మాదిలా మారిన సుబ్రహ్మణ్యం పడకగదిలో నిద్రిస్తున్న సుకుమార్‌ తలపై రోకలిబండతో విచక్షణా రహితంగా దాడిచేశాడు. కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. సుకుమార్‌ మృతిపై తల్లి సరోజ ఫిర్యాదు మేరకు బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.

సుబ్రహ్మణ్యంకు సరోజ మూడో భార్య
సుబ్రహ్మణ్యంకు ఇది వరకే రెండు వివాహాలయ్యాయి. మొదటి భార్య మృతి చెందడంతో మరో మహిళను వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఆమె సుబ్రహ్మణ్యంకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటుంది. అనంతరం సరోజను మూడో వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం కలతలు చోటు చేసుకున్నాయి.

మృతదేహానికి పోస్టుమార్టం
సుకుమార్‌ మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికందివచ్చిన కొడుకు విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లి హృదయరోదన చూపరులను కంటతడి పెట్టించింది. ఇన్‌స్పెక్టర్‌ జి. సంగమేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top