అనుమానం మిగిల్చిన విషాదం

Father Killed Son In Chennai - Sakshi

కుమారుడిని హతమార్చి కార్మికుడు ఆత్మహత్య

అన్నానగర్‌ : కోవైలో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త కుమారుడిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కోవై సమీపం శివానంపురం 3వ వీధికి చెందిన అర్జునన్‌ (40) టైలర్‌. ఇతని భార్య అలమేలు (33). వీరికి వివాహం జరిగి 14ఏళ్లు అవుతోంది. వీరి కుమారుడు యూకాస్‌ (13). ఇతను అదే ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అర్జునన్‌ ఇంట్లోనే దుస్తులను కుట్టి ఇస్తూ వచ్చాడు. అలమేలు ఆవారంపాళయంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ వచ్చింది. అలమేలు తరచూ సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తూ వచ్చింది. పలుసార్లు అర్జునన్‌ తన భార్య వద్ద సెల్‌ఫోన్‌ అధికంగా ఉపయోగించవద్దని చెప్పాడు. అది వినకుండా ఆమె తరచూ ఒక వ్యక్తితో వాట్సాప్‌లో మాట్లాడుతూ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. మూడు రోజుల కిందట అలమేలు రాత్రి సమయంలో ఎక్కువసేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసింది. దీనిపై అర్జునన్‌ ప్రశ్నించడంతో మళ్లీ తగాదా ఏర్పడింది.

గురువారం అలమేలు పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపులు లోపలివైపు తాళం వేసి ఉన్నాయి. పలుసార్లు తట్టినా తలుపులు తెరవలేదు. దీంతో ఆమె శరవణంపట్టి పోలీసులకు సమాచారం అందించింది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి  చూడగా అక్కడ అర్జునన్, కుమారుడు యూకాస్‌ ఉరికి వేలాడుతూ శవంగా ఉన్నారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ గదిలో తనిఖీ చేయగా ఓ లేఖ చిక్కింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా భార్య తరచూ సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ వస్తుంది. దీంతో ఆమె ప్రవర్తనపై అనుమానం ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడిని వదలి వెళ్లడానికి మనస్సు ఒప్పకపోవడంతో అతన్ని నాతోనే తీసుకెళుతున్నానని రాసి ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top