కనుపాపలను కాటేసిన కనురెప్పలు

Father killed Son And Daughter In Kurnool - Sakshi

వేరే వ్యక్తితో వెళ్లిపోయిన భార్య

ఆ కసితో కన్నబిడ్డలను కడతేర్చిన కసాయి

బ్లేడుతో గొంతుకోసి, నీటికుంటలో ముంచి కొడుకు, కుమార్తె హత్య

ఆత్మహత్యాయత్నం విఫలం కావటంతో పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు

కనుపాపలను కనురెప్పలేకాటేశాయి. కన్నతండ్రే కాల యముడయ్యాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలను కర్కశంగా కడతేర్చాడు. భార్య చేసిన పాపానికి బంగారం లాంటి బిడ్డలను బలి తీసుకున్నాడు. మనస్తాపమో.. క్షణికావేశమో..అతను చేసింది మాత్రం మహా ఘోరం. తప్పు ఆమె చేసినా.. నిస్సహాయత అతన్నిఆవరించినా..అంతిమంగా బలైంది మాత్రం అభం శుభం తెలియని పసిబిడ్డలు.
రక్తసంబంధాన్నే రక్తాక్షరాలతో తుడిపేయడం దుర్మార్గం,కిరాతకం. కుటుంబబాంధవ్యాలనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ విషాదకర ఘటన జూపాడుబంగ్లాలోచోటుచేసుకుంది.

జూపాడుబంగ్లా:  భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కసితో కన్నబిడ్డలను కడతేర్చాడో దుర్మార్గుడు. కుమారుడు, కుమార్తెను బ్లేడుతో గొంతుకోసి, నీటికుంటలో ముంచి దారుణంగా హత్య చేశాడు. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మండలకేంద్రమైన జూపాడుబంగ్లాలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు, నిందితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఉన్న వాగుమడుగు గ్రామానికి చెందిన ఝాన్సీబాయికి కర్నూలు నగరానికి చెందిన ధనోజీరావుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి లిఖిత(7), మధు(4) అనే ఇద్దరు పిల్లలు. లిఖిత జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. వీరు నాలుగేళ్ల క్రితం జూపాడుబంగ్లాకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. ఝాన్సీబాయి తరచూ ఇతరులతో వెళ్లిపోతుండడంతో భర్త రెండు, మూడు పర్యాయాలు జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గత నెలలో కూడా అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఖలంధర్‌ అనే వ్యక్తితో కుమారుడు మధును కూడా వెంటబెట్టుకొని పారిపోయింది. ఈ విషయమై భర్త స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకొని తీసుకొచ్చారు. పక్షం రోజుల క్రితం భార్యాభర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. కాగా.. ఈ నెల ఆరో తేదీన ధనోజీరావు తాపీపనుల నిమిత్తం వెళ్లాడు. ఇదే సమ యంలో ఝాన్సీబాయి రూ.2వేల నగదు తీసుకొని.. కుమార్తె, కుమారుడిని ఇంటివద్దే వదిలి, ఆమె తల్లి అంజనమ్మ కళ్లుగప్పి పారిపోయింది. తర్వాత పిల్లలను కాచుకొని ఉండాల్సిన అవ్వ అంజనమ్మ సైతం వారిని ఒంటరిగా వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ధనోజీరావు మనస్తాపానికి గురయ్యాడు. తాను పనులకు వెళ్తే మీ బాగోగులు చూసుకొనే వారెవ్వరూ ఉండరని, కావున ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకుందామని పిల్లలతో నమ్మబలికాడు. ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే విషయమై తండ్రి, కుమార్తె తర్జనభర్జన పడ్డారు.

బ్లేడుతో గొంతుకోసుకొని చనిపోవాలనుకున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కొడుకు, కుమార్తెను తోలుకొని తాను కొత్తగా నిర్మించుకున్న రేకులషెడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ లిఖితను పడుకోబెట్టి వెంట తీసుకెళ్లిన బ్లేడుతో గొంతుకోశాడు. గొంతుపూర్తిగా తెగకపోవటంతో లిఖిత లేచికూర్చొంది. దీంతో కొడుకు, కుమార్తెను తీసుకుని షెడ్డు వెనుక ఉన్న నీటికుంట వద్దకు వెళ్లాడు. వారిని నీటికుంటలో అదిమి పట్టడంతో ఊపిరాడక చనిపోయారు. ఆ తర్వాత వారి మృతదేహాలను షెడ్డులో పడుకోబెట్టాడు. షెడ్డులోని కర్రలకు టెలిఫోన్‌తీగతో తనూ ఉరివేసుకోబోయాడు. తీగతెగిపోయింది. తర్వాత ఒంటిపై ఉన్న షర్టును తీసి కర్రలకు కట్టి ఉరివేసుకోబోయాడు. ఆ ప్రయత్నమూ విఫలం కావటంతో నాలుగు గంటల ప్రాంతంలో నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు.

అలుముకున్న విషాదం: ఈ ఘోరం గురించి తెలుసుకున్న ధనోజీరావు తల్లి జానకమ్మ కర్నూలు నుంచి హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుంది. విగతజీవులుగా పడి ఉన్న మనవడు, మనవరాలిని చూసి గుండెలవిసేలా రోదించింది. తనకు భార్య వద్దంటే వద్దని తన కొడుకు ఎంతగా మొత్తుకొన్నా పోలీసులు నచ్చజెప్పి పంపారని, ఆమె మరోసారి భర్త, పిల్లలను మోసంచేసి పారిపోవటం వల్లే తన కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని నెత్తినోరు కొట్టుకుంటూ రోదించింది. ముక్కుపచ్చలారని చిన్నారులను తండ్రే చంపేశాడన్న విషయం దావానలంగా వ్యాపించటంతో జూపాడుబం గ్లాతో పాటు సమీపంలోని గ్రామాల ప్రజ లు తండోపతండాలుగా వచ్చి చూశారు. పిల్లలను చంపటానికి చేతులెలా వచ్చాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

పాఠశాలలకు సెలవు: కన్నతండ్రి కొడుకు, కుమార్తెను హత్యచేశాడన్న విషయం తెలుసుకొన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాఠశాలలను మూయించి వేశారు. లిఖిత చదివే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top