నడిరోడ్డుపై దారుణహత్య

Father And Son Together Murdered Some One In Rangareddy - Sakshi

పాతకక్షలతో గొడ్డళ్లతో నరికి చంపిన తండ్రీకొడుకులు

అనంతరం ఠాణాలో లొంగుబాటు

తన కొడుకుని చంపాడన్న అనుమానంతో దారుణం 

మహేశ్వరం : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నడిరోడ్డుపై హత్యోదంతాన్ని మరువకముందే.. రంగారెడ్డి జిల్లాలో మరో యువకుడు ఇదే తరహాలో హత్యకు గురయ్యాడు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటలకు అందరూ చూస్తుండగానే.. పాతకక్షలతో ఓ వ్యక్తిని తండ్రీకొడుకులు నడిరోడ్డుపైనే కిరాతకంగా నరికి చంపేశారు. గతేడాది తన కుమారుడు కృష్ణ అనుమానాస్పద మృతికి తొట్ల రాజు (38) కారణమనే అనుమానంతో కృష్ణ తండ్రి కావలి శంకరయ్య, సోదరుడు మచ్చేందర్‌లు ఈ దారుణానికి ఒడిగట్టారు. సీఐ అర్జునయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన తొట్ల రాజు (38) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కావలి కృష్ణ, రాజు స్నేహితులు. అయితే గతే డాది కృష్ణ మృతి చెందాడు. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాజు ఈ హత్యచేసి ఉంటాడనే అనుమానంతో కృష్ణ కుటుంబసభ్యులు అతడి ఇంటిపై దాడి చేశారు.

దీంతో రాజు కుటుంబం నాగారం గ్రామం వదిలి షాద్‌నగర్‌లో కూలీ పనిచేసుకుని బతుకుతోంది. అయితే, ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకునేందుకు ఆదివారం ఉదయం రాజు, అతని తండ్రి నర్సింహ నాగారం వచ్చారు. పని ముగించుకుని షాద్‌నగర్‌ వెళ్లేందుకు గ్రామంలోని బస్‌స్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. ఏడాదిగా రాజుపై పగ పెంచుకున్న కృష్ణ తండ్రి, సోదరుడికి ఈ విషయం తెలిసింది. వీళ్లు గొడ్డళ్లతో వచ్చి బస్టాండ్‌ పక్కన కటింగ్‌ షాప్‌ ముందున్న రాజుపై మెరుపుదాడి చేశారు. కొంత దూరంలో ఉన్న రాజు తండ్రి అక్కడికి వచ్చే సరికే దారుణం జరిగిపోయింది. గ్రామం నడిబొడ్డున అందరు చూస్తుండగానే ఈ హత్య జరిగినా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య రేనా, ఇద్దరు కుమారులున్నారు. హత్య చేసిన అనంతరం శంకరయ్య, మచ్చేందర్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇబ్రహీం పట్నం ఏసీపీ మల్లారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కృష్ణ మృతి విషయంలో రాజుకు ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు, పోలీసులు అంటున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో రోడ్డుపై సీసీ కెమెరాలు స్తంభాలకు బిగించినా అవి పనిచేయడం లేదు.  

ఏడాది క్రితం ఇదీ జరిగింది: నాగారం గ్రామానికి చెందిన కావలి కృష్ణ, తొట్ల రాజు స్నేహితులు. 2017 జనవరి 12న శంషాబాద్‌ మండలం తొండుపల్లిలో వీరు కల్లు తాగారు. ఇంటికి వస్తుండగా కావలి కృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడంతో రాజు.. అతని మృతదేహాన్ని స్టేషన్‌ తిమ్మాపూర్‌ రైలుపట్టాల పక్కన పడేసి పారిపోయాడు. రెండ్రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. కృష్ణను రాజే హత్య చేశాడనే అనుమానంతో కృష్ణ తండ్రి శంకరయ్య, తమ్ముడు మచ్చేందర్‌తో పాటు పలువురు రాజు ఇంటిపై అప్పట్లో దాడి చేశారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top