వేటగాళ్ల విద్యుత్‌ ఉచ్చుకు రైతు బలి

The Farmer Die due to Hunters Electric Trap - Sakshi

సాక్షి, పాల్వంచరూరల్‌: జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన విద్యుత్‌ ఉచ్చుల్లో జంతువులు పడుతున్నాయో లేదోగానీ... మనుషులు మాత్రం బలవుతున్నారు. ఓ రైతు ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని రెడ్డిగూడెం (ప్రభాత్‌నగర్‌) గ్రామ రైతు సామా శ్రీనివాసరెడ్డి(43), మంగళవారం తెల్లవారుజామున పంట చేనుకు నీళ్లు పెట్టేందుకని వెళ్లాడు. అక్కడ అప్పటికే జంతువుల కోసం వేటగాళ్లు విద్యుత్‌ తీగలతో ఉచ్చు ఏర్పాటు చేశారు. దానికి శ్రీనివాసరెడ్డి తగిలాడు. ఆ వెంటనే విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ ఉచ్చులో జంతువులు పడ్డాయో లేదోనని చూసేందుకు వచ్చిన వేటగాళ్లకు.. రైతు మృతదేహం కనిపించింది.

తమ ఉచ్చుల వ్యవహారం బయటపడుతుందేమోనన్న భయంతో ఆ రైతు మృతదేహాన్ని చాపలో చుట్టి, తవిసలగూడెం గుట్ట పైకి తీసుకెళ్లి, అక్కడ చెట్ల పొదల మద్య దాచిపెట్టారు. పంట చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన తన భర్త ఉదయం వరకు రాకపోవడంతో భార్య సత్తెమ్మ, బంధువులు కలిసి పంట చేను వద్ద గాలించారు. గట్టు మీద మృతదేహం కనిపించింది. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు భోరున ఏడ్చారు. ఆ ప్రదేశాన్ని, వేటగాళ్ల ఉచ్చును ఎస్‌ఐ అనిల్‌ పరిశీలించారు. శ్రీనివాసరెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసును ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉచ్చును అమర్చినట్టుగా భావిస్తున్న వేటగాళ్లయిన పాండురంగాపురానికి చెందిన తోకల ప్రసాద్, పిట్టల రంగయ్యను ఎస్‌ఐ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం, జామాయిల్‌ తోట చుట్టూ పెట్టిన విద్యుత్‌ ఉచ్చుకు చిక్కుకుని పాండురంగాపురం గ్రామస్తుడైన పశువుల కాపరి మృతిచెందాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top