సకుటుంబ.. సపరివార సమేతంగా

Family Arrest in Robbery Case Hyderabad - Sakshi

ఓజికుప్పం ముఠాలు నేరాలు చేసే తీరిదీ

చిన్న పిల్లలతో సహా వచ్చి బస్సుల్లో చోరీలు

నలుగురి అరెస్టు   రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: ఓ భర్త, తన ఇద్దరు భార్యలు, పిల్లలు, సోదరి, పెద్ద భార్య చెల్లెలు... ఇలా సకుటుంబ సపరివార సమేతంగా బస్సుల్లో తిరిగే ఓజికుప్పం ముఠా ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్‌ డైవర్షన్‌ నేరాలకు ఒడిగడుతుంది. ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకున్న తర్వాత అక్కడ త్రీస్టార్‌ హోటల్స్‌లో బస చేస్తారు. తమ చేతిలో ఉన్న పిల్లలను టార్గెట్‌కు ఇచ్చి మరీ వారి బ్యాగుల్లో ఉన్న నగదు, సొత్తు చేజిక్కించుకుంటారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం తెలిపారు. వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతిలతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

రెండో భార్య నేతృత్వంలో గ్యాంగ్‌...
ఆంధ్రప్రదేశ్‌–తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓజికుప్పం ప్రాంతం వేలూరు జిల్లాలో ఉంటుంది. ఆ గ్రామంలో దృష్టి మళ్లించి నేరాలు చేసే ముఠాలు అనేకం ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పంజా విసిరే ఈ ముఠాల్లో గాయత్రి గ్యాంగ్‌ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో స్థిరపడింది. సిగరెట్ల వ్యాపారి ఎస్‌.రాజు, మొదటి మొదటి భార్య గాయత్రి, రెండో భార్య కోకిల, గాయత్రి సోదరి జ్యోతి, రాజు చెల్లెలు అనిత... వీరితో ఏర్పాటు చేసిన ముఠాకు గాయత్రి నేతృత్వం వహిస్తోంది. వీరు నేరం చేయడానికి వెళ్లేప్పుడు గాయత్రి, కోకిలలకు చెందిన పిల్లల్ని కూడా చంకన వేసుకుని వెళ్తారు. ప్రధానంగా రద్దీగా ఉన్న సిటీబస్సుల్నే టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతూఉంటారు.  ఒక్కో సిటీలో రెండు నెలల పాటు ఉండేవీరు గరిష్టంగా రూ.కోటి కొట్టేసిన తర్వాతే మకాం మారుస్తారు. 

జల్సాలు.. షాపింగ్‌లు...
ఓ చోట నేరాలు చేసిన తర్వాత మరో నగరానికి మకాం మారుస్తారు. ఈ ముఠా సభ్యులు ఓ నగరం నుంచి మరో నగరానికి ఎక్కువగా డబ్బు తీసుకువెళ్లరు. చోరీ చేసిన సొమ్ముతో జ్యువెలరీ దుకాణాలు, బ్రాండెడ్‌ షోరూమ్స్‌లో షాపింగ్స్‌ చేసి పసిడి రూపంలోనే పట్టుకుపోతుంటారు. అత్యంత విలాస జీవితం గడపటంతో పాటు నేరాల ద్వారా వచ్చిన డబ్బుతో బెంగళూరులోని  వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గాయత్రి గ్యాంగ్‌ ఈ ఏడాది జూన్‌ ఆఖరి వారంలో ఆసిఫ్‌నగర్‌ పరిధిలో ఓ నేరం చేసింది. సికింద్రాబాద్‌ నుంచి సిటీ బస్సులో మెహదీపట్నం వస్తున్న పి.జయలక్ష్మి అనే వృద్ధురాలి నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు కాజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి శుక్రవారం అనిత సహా మిగిలిన ముఠా సభ్యులను పట్టుకున్నారు. వీరి నుంచి 35 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదే మొదటిసారి
ఈ ఓజికుప్పం గ్యాంగ్‌ను సిటీలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. వీరు ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, హుమాయున్‌నగర్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నల్లకుంట, నాంపల్లి, నాచారం, బాలానగర్, హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 నేరాలు చేసినట్లు గుర్తించాం. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ నేరాలు చేశారనేది ఆరా తీస్తున్నాం. వీరిని పట్టుకోవడంలో ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి కీలక పాత్ర పోషించారు.– ఏఆర్‌ శ్రీనివాస్, వెస్ట్‌జోన్‌ జేసీపీ  

పిల్లల్ని టార్గెట్‌ చేతికి ఇచ్చి...
ఈ ముఠా రైళ్లల్లో సెకండ్‌ ఏసీ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తూ వివిధ నగరాలకు చేరుకుంటుంది. ఆపై అక్కడి ఏదో ఒక ప్రాంతంలోని త్రీస్టార్‌ హోటల్‌లో బస చేస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో గ్యాంగ్‌లోని మహిళలు పిల్లాపాపలతో కలిసి సిటీ బస్సులు ఎక్కుతారు. ఆ బస్సులో పురుçషులు ఉండే చోట ఎక్కే రాజు పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. వీరు ప్రధానంగా బ్యాగ్‌లు, పెద్ద పర్సులతో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళలను గుర్తించి టార్గెట్‌గా చేసుకుంటారు. వీరిలో ఓ గ్యాంగ్‌ మెంబర్‌ తన చేతిలో ఉన్న చిన్న పిల్లను ఎత్తుకోలేక పోతున్నట్లు నటిస్తుంది. ఈ వంకతో తన చేతిలో ఉన్న చిన్నారిని టార్గెట్‌కు ఇస్తారు. ఆపై అందరూ ఆమె చుట్టు చేరి మరింత హడావుడి చేస్తూ బ్యాగ్‌/పర్సు జిప్‌ తీసి అందులోని డబ్బు, బంగారం తస్కరిస్తారు. ఆ వెంటనే వచ్చే స్టాప్‌లో చిన్నారులతో సహా దిగిపోతారు. ఇలా ఓ నగరంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా రూ.కోటి సొత్తు/సొమ్ము తస్కరిస్తారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top