పీకలదాకా తాగి నడిరోడ్డుపై న్యూసెన్స్‌

Drunked Womens Fight on Hyderabad Road - Sakshi

పీకలదాకా తాగిన ఓ ఇద్దరు యువతులు నడిరోడ్డుపై హంగామా చేశారు.. ఒకరిపై ఒకరుదాడిచేసుకుంటూ  గందరగోళం సృష్టించారు. వీరే కాక నగరంలో అనేకమంది మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఒకరు పోలీసులపై తిరగబడితే.. మరొకరు శ్వాసపరీక్షకు నిరాకరించారు. పోలీసులు వారిపై కేసులున మోదు చేశారు.

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు యువతులు పీకల దాకా మద్యం తాగి.. ఆ మత్తులో అర్ధరాత్రి నడి రోడ్డుమీద ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన మేరకు..శనివారం అర్ధరాత్రి ఇద్దరు యువతులు జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు.  కేబీఆర్‌ పార్కు వైపు కారులో వస్తుండగా ఓ యువకుడి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అక్కడే కారు ఆపి ఇద్దరు ఒకరిపై ఒకరు దుర్బాషలాడుకున్నారు. జుట్టుపట్టుకొని ఒకరినొకరు కిందపడేసుకుంటూ న్యూసెన్స్‌ చేశారు. నానా రచ్చతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అదే సమయంలో కొందరు యువకులు, ఆకతాయిలు రోడ్డుపై జరుగుతున్న ఇద్దరు యువతుల రచ్చను చూసి రెచ్చిపోయారు. వారి వెంట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. గంటపాటు తాగిన మత్తులో యువతులు వీరంగం చేస్తుంటే వారిని ఆటపట్టిస్తూ ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. ఎలిజబెత్‌ అనే యువతి తనను కొట్టడమే కాకుండా న్యూసెన్స్‌కు పాల్పడిందంటూ బ్యూటీషియన్‌ దీపాశర్మ ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూసుఫ్‌గూడలోని వెంకటగిరిలో నివసించే తాను వెళ్తుండగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఎలిజబెత్‌ తాగిన మైకంలో తనపై దాడికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎలిజబెత్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నదని ఆరోపించింది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే తనకేమీ సంబంధం లేదని తాను బాధ్యురాలిని కాదని తెలిపింది. ఎలిజబెత్‌ ప్రవర్తన సైకోను తలపించిందని వెల్లడించింది. గతంలో కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పింది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా పోలీస్‌స్టేషన్‌లో కూడా ఈ ఇద్దరు న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. వారిద్దరినీ నియంత్రించడం పోలీసులకు సాధ్యపడలేదు. ఆదివారం తెల్లవారుజాము వరకు వీరిద్దరూ అదుపుతప్పి ప్రవర్తిస్తూ పోలీస్‌స్టేషణ్‌లోనే బైఠాయించారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపించారు.  

యువకుడి హల్‌చల్‌
రాంగోపాల్‌పేట్‌: డ్రంకన్‌ డ్రైవ్‌లో ఓ యువకుడు తన అన్నను పోలీసులు పట్టుకున్నారంటూ హల్‌చల్‌ చేశాడు. పోలీసులను, ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో, డ్యాన్సులతో నానా హంగామా చేశాడు.  పోలీసులు తెలిపిన మేరకు..  వివరాల ప్రకారం నల్లగుట్టకు చెందిన ప్రణీత్‌ (21) తన స్నేహితులతో కలిసి మద్యం తాగి ఎస్డీరోడ్‌లో ప్యారడైజ్‌ నుంచి ప్యాట్నీ సెంటర్‌ వైపు వెళుతున్నారు. అదే సమయంలో హాంకాంగ్‌ బజార్‌ వద్ద మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ప్రణీత్‌ ద్విచక్ర వాహనంపై ప్యాట్నీ సెంటర్‌వైపు వెళుతుండగా పోలీసులు వాహనాన్ని నిలిపివేశారు. బ్రీతింగ్‌ అనలైజర్‌ ద్వారా తనిఖీ  170 పాయింట్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న ప్రణీత్‌ సోదరుడు నాని అలియాస్‌ ప్రశాంత్‌ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్‌ తన సోదరుడి వాహనాన్ని ఎందుకు ఆపివేశారంటూ పోలీసులను ప్రశ్నించాడు. తాను ఏబీవీపీ సభ్యుడిని అంటూ తాను తలచుకుంటే మొత్తం గ్యాంగ్‌ నిమిషాల్లో చేరుకుని మీ అంతు చూస్తారని హెచ్చరించాడు.  ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తూ మాట్లాడాడు.  పోలీసుల ముందే డ్యాన్సులు చేస్తూ, వెకిలి చేస్టలు చేస్తూ హంగామా చేశాడు. అదే సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు మహంకాళి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.  

నైజీరియన్‌ హంగామా..
బంజారాహిల్స్‌: ప్రియురాలితో కలిసి ఓ పబ్‌లో ఫుల్లుగా మద్యం తాగి కారు డ్రైవింగ్‌ చేస్తూ ఓ నైజీరియన్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–45లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నైజీరియాకు చెందిన అదెయమి అడెజసిన్‌ అడెఉన్‌మి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూ పారామౌంట్‌కాలనీలో అద్దెకుంటున్నాడు. శనివారం రాత్రి తన ప్రియురాలితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే తన స్నేహితురాలిని ఎక్కించుకొని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–45 మీదుగా వెళ్తుండగా అక్కడ తనిఖీల్లో భాగంగా పోలీసులకు చిక్కాడు. అయితే శ్వాస పరీక్షలకు నిరాకరించాడు. పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా న్యూసెన్స్‌కు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న కెమెరామెన్లపై దాడికి పాల్పడి కెమెరాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ శివశంకర్‌ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. నైజీరియన్‌ మద్యం మత్తులో మీడియా ప్రతినిధులపై రాళ్ల దాడికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. గతంలో కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి చంచల్‌గూడ జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top