కట్న దాహానికి వివాహిత బలి

Dowry Harassments Women Suicide Nellore - Sakshi

కోవూరు: అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లూరు జనార్దన్‌రెడ్డి, పద్మావతి దంపతులు కొంత కాలం క్రితం కోవూరులోని కోనమ్మతోటకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె తేజ (20)కు వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన పోకల రాజశేఖర్‌రెడ్డితో 2017 జూన్‌ 16న వివాహం అయింది. ఆ సమయంలో 14 సవర్ల బంగారంతో పాటు రూ.5 లక్షల నగదు ఇస్తామని తేజ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కట్నం కింద ఇస్తామన్న రూ.5 లక్షలు ఇవ్వలేకపోయారు. దీంతో కట్నం కోసం తేజను భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు అత్తమామలు మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు.

దీనికి తోడు వివాహేతర సంబంధాలు అంటకట్టి ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తేజ కోవూరులోని పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చి ప్రయత్నం చేశారు. ఈ విధంగా రెండు సార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. రూ.5 లక్షలు కట్నం ఇస్తేనే తేజను కాపురానికి తీసుకు వెళ్తామని చెప్పడంతో రూ.లక్ష సమకూర్చి పెద్ద మనుషుల సమక్షంలో అందజేశారు. మిగతా డబ్బులిస్తేనే కాపురానికి తీసుకువెళ్తానని చెప్పి వెళ్లిపోయారు. బుధవారం భర్త రాజశేఖర్‌రెడ్డి, అత్తమామలు పోకల సుబ్బలక్ష్మమ్మ, సుబ్బరామిరెడ్డి, బంధువులు స్వామి రంగారెడ్డి, బాలనాగిరెడ్డి, నాగిరెడ్డి కోవూరులోని తేజ ఇంటికి వచ్చి మిగతా రూ.4 లక్షలు ఎప్పుడు ఇస్తారని మరో మారు గొడవ చేశారు.

ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టి, కట్నం ఇవ్వలేని మనుషులు కూతురు పెళ్లి ఎందుకు చేశారని మానసిక వేధింపులకు గురి చేశారు. ఈ అవమానాలు భరించలేక తేజ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తలిద్దరూ గేదెలను మేపుకుని సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా తేజ ఉరేసుకుని ఉండడాన్ని చూసి కుప్పకూలిపోయారు. స్థానికులు అక్కడికి చేరుకుని తేజను కిందకు దించి ప్రాణాలతో ఉందేమోనని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు తేజను పరిశీలించి మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న తేజ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తేజకు వివాహం జరిగి ఏడాదిలోపు కావడంతో  తహసీల్దార్, డీఎస్పీ సమక్షంలో పంచనామా చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top