చెవి కమ్మల కోసమే చంపేశాడు!

Double Murder Case Reveals Hyderabad Police - Sakshi

పూజలు నేర్పుతానంటూ వల పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి

లంగర్‌హౌస్‌ జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ నిందితుడి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: లంగర్‌హౌస్‌ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. ధాతునగర్‌ కల్లు కాంపౌండ్‌లో పరిచయమైన ఓ శివసత్తి అక్కాచెల్లెళ్ల చెవి కమ్మలపై కన్నేశాడు. కష్టాలు తీరడానికి కొన్ని పూజలు నేర్పుతానంటూ పథకం ప్రకారం మూసీ ఒడ్డుకు తీసుకువచ్చాడు. పూటుగా కల్లు తాగించి కమ్మలు తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఇటుక రాయితో మోది ఇద్దరినీ చంపేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అంకురి గిరి అలియాస్‌ గిరి అమ్మను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. 

కల్లు కాంపౌండ్‌లో పరిచయం...
రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, దెబ్బడగూడ గ్రామానికి చెందిన రాజు–యాదమ్మ, లక్ష్మణ్‌–సుమిత్ర దంపతులు 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి మీర్‌పేట పరిధిలో లెనిన్‌నగర్‌లో ఉండేవారు. అక్కాచెల్లెళ్లు అయిన యాదమ్మ, సుమిత్ర సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా... రాజు, లక్ష్మణ్‌లు అడ్డా కూలీలుగా జీవనం సాగించేవారు. సుమిత్ర భర్త లక్ష్మణ్‌ మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సుమిత్ర.. యాదమ్మతో కలి సి కల్లు తాగడానికి అలవాటుపడింది. ఆ వ్యసనానికి బానిసలైన వీరు ఇద్దరూ నిత్యం మత్తులోనే జోగుతూ ఉండేవారు. వీరి వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉండటంతో కాలనీవాసులు పలుమార్లు మందలించారు. దీంతో వారు ఆరు నెలల క్రితం అయోధ్యనగర్‌లో పక్కప క్క గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత సోమవారం సాయంత్రం యాదమ్మ, సుమిత్ర ఎప్పటిలాగే ధాతూనగర్‌లోని కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు. అక్కడే కల్లు తాగడానికి వచ్చిన పేట్లబురుజు వాసి గిరి అమ్మతో వీరికి పరిచయం ఏర్పడింది.

పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నారు...
నగరానికి చెందిన గిరి ఏడో తరగతి వరకు చదివి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ చంద్రాయణగుట్ట సర్కిల్‌లో కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం ‘శివ సత్తి’గా (పూజారి) మారిన ఇతను పలు దేవాలయాల్లో పూజలు, బోనాలకు ప్రత్యేక వేషాలు వస్తుంటాడు. తరచూ ధాతునగర్‌ కల్లు కాంపౌండ్‌కు వెళ్లే ఇతను సాధారణంగా మధ్యాహ్నం 2 లేదా 3 గంటల ప్రాంతంలో తాగి వచ్చేస్తుంటాడు. అయితే గత సోమవారం సాయంత్రం 4.30కు అక్కడికి వెళ్లి ఓ మూలన కూర్చుని కల్లు తాగుతున్నాడు. ఇతడిని చూసిన యాదమ్మ, సుమిత్ర తమ వద్దకు రమ్మని పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. జడను తలపించే జుట్టు, హావభావాలు చూసి ఏం చేస్తుంటావని ప్రశ్నించారు. దీంతో విషయం చెప్పిన అతను తనకు కొన్ని అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మబలికాడు. తాను బోనాలు సహా ఇతర సందర్భాల్లో వేసుకున్న వేషాలు, చేసిన డ్యాన్సులకు సంబంధించి తన ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలను వారికి చూపించాడు. వీటిని చూసిన వెంటనే తన బాధలు చెప్పుకున్న సుమిత్ర వాటి పరిష్కారానికి ఏమైనా పూజలు ఉంటే నేర్పాలని కోరింది. 

నిర్మానుష్య ప్రాంతంలో నేర్చుకోవాలని...
మాటల సందర్భంలో వారి మెడలో ఉన్న గొలుసులు రోల్డ్‌గోల్డ్‌ అని, చెవి కమ్మలు మాత్రం బంగారం అని తెలుసుకున్నాడు. వారి కష్టాలు తీరడానికి ప్రత్యేకమైన పూజలు నేర్పుతానని చెప్పిన గిరి అందుకోసం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని తెలిపాడు. తరచూ కల్లు తాగేందుకు అత్తాపూర్‌లోని కల్లు కాంపౌండ్‌కు వచ్చే ఇతడికి పూర్తిగా అవగాహన ఉండటంతో వారిని ఆటోలో అక్కడికి తీసుకువచ్చాడు. ప్రధాన రహదారిపై దిగిన తర్వాత మరికొంత కల్లు తాగాలని, అక్కాచెల్లెళ్లతో పూటుగా తాగించాలని భావించాడు. తాను నేరుగా వారిని తీసుకెళితే ఎవరైనా గమనిస్తారని భావించాడు. దీంతో ఆ కల్లు కాంపౌండ్‌లో కల్లు రుచిగా ఉంటుందని వారితో చెప్పిన గిరి నాలుగు సీసాలు పార్శిల్‌ తెప్పించాడు. ఆ ఇద్దరితో కలిసి పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే బ్రిడ్జ్‌ పిల్లర్‌ నెం.118 కింది భాగంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వెళ్తూ దారిలో రూ.10 వెచ్చించి పసుపు ఖరీదు చేసుకుని జేబులో పెట్టుకుని వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరిన తర్వాత వారితో కల్లు తాగించిన గిరి ఆపై ముఖాలకు పసు పు పూసి పూజలు ప్రారంభిద్దామంటూ చెప్పాడు. పూర్తిగా మత్తులోకి జారుకున్నట్లు గుర్తించి చెవి కమ్మలు తీయడానికి ప్రయత్నించాడు.

విచారణలో చుక్కలు చూపించాడు...
ఈ కేసు దర్యాప్తు కోసం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్‌ ముజఫర్‌ అలీ తమ బృందాలతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాదాపు 300 గంటల ఫీడ్‌ను అధ్యయనం చేసి అనుమానితుడిని గుర్తించారు. దాదాపు 40–50 మందిని విచారించిన తర్వాత గిరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం అంగీకరించడంతో చెవి కమ్మలు, సెల్‌ఫోన్‌ రికవరీ చేశారు. కల్లుకు పూర్తిగా బానిసైన ఇతగాడు అది తాగకపోతే పిచ్చివాడిగా మారిపోతాడు. ఈ నైజంతోనే విచారణలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చుక్కలు చూపాడు. కల్లు నాలుకపై పడకపోయేసరికి దేవుడు వస్తున్నాడని, తన కుమారుడు, తల్లి కళ్ల ముందు కనిపిస్తున్నారంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తికమక పెట్టాడు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంగర్‌హౌస్‌ ఠాణాకు అప్పగించారు.  

శవాలు సైతం మాయం చేయాలని...
ఈ విషయం గమనించిన యాదమ్మ ప్రతిఘటించడంతో సమీపంలో ఉన్న ఇటుక రాయితో ఆమెపై దాడి చేసేసరికి కింద పడిపోయింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సుమిత్రనూ ఇలానే కొట్టాడు. ఆపై చీరలతో ఇద్దరి మెడకు ఉరి బిగించి చంపేశాడు. మృతదేహాలు సైతం దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో వాటిని మూసీ నీటిలోకి లాక్కెళ్లి పైన బండరాయి విసిరాడు. చెవికమ్మలు, సెల్‌ఫోన్‌తో పాటు వారి వద్ద ఉన్న రూ.180 తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఓ జత కమ్మలను తన తల్లికి ఇచ్చిన గిరి రూ.3 వేలకు కొన్నానంటూ ఆ మొత్తం తీసుకున్నాడు. మూసీ ఒడ్డున మెంతికూర పడించే  సురేందర్‌ సింగ్‌ మరుసటి రోజు మధ్యాహ్నం (గత మంగళవారం) తన పంట వద్దకు వెళ్లాడు. మొక్కలకు నీరుపోయడానికి మూసీలో దిగగా కాళ్లకు మృతదేహం తగిలింది. బయటకు తీయడానికి ప్రయత్నించగా ఒకదాని తర్వాత మరోటి బయటకు వచ్చాయి. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించడంతో లంగర్‌హౌస్‌ అధికారులతో పాటు వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ అక్కడకు చేరుకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top