చిన్నారుల లైంగిక దాడులపై దృష్టి పెట్టండి

DGP Video Conference With Officials In Kurnool - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో  డీజీపీ ఆదేశం  

కర్నూలు : చిన్నప్లిలలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి నియంత్రణపై దృష్టి పెట్టాలని డీజీపీ మాలకొండయ్య పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మంగళగిరి నుంచి పోక్సో యాక్ట్‌పై అన్ని జిల్లాల పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ గోపీనాథ్‌ జట్టి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ పోక్సో యాక్ట్‌ కింద నమోదైన కేసుల సంఖ్యను జిల్లాల వారీగా చూపించి వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  వేసవి సెలవుల నేపథ్యంలో వీటిపై కాలనీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లైంగిక చర్యలకు పాల్పడేవారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతోపాటు రౌడీషీట్లు తెరవాలన్నారు.

మహిళా రక్షక్‌ బృందాలు మహిళలపై జరిగే దాడులను అరికట్టాలన్నారు. జిల్లాలో పోక్సో యాక్ట్‌ కింద నమోదైన కేసుల వివరాలను ఎస్పీ గోపీనాథ్‌ జట్టి తెలియజేశారు. మహిళా రక్షక్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఆదోని, కర్ణాటక సరిహద్దుల్లో ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. సినిమా థియేటర్లలో కూడా లఘుచిత్రాలు ప్రదర్శించి ఇటువంటి సంఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామన్నారు. అడిషనల్‌ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు వెంకటాద్రి, బాబుప్రసాద్, ఖాదర్‌బాషా, ఆకవీడు ప్రసాద్, మాధవరెడ్డి, హుసేన్‌పీరా, వినోద్‌కుమార్, బాబా ఫకృద్దీన్, పి.ఎన్‌.బాబు, సీఐ జాన్సన్, ఈ–కాప్స్‌ ఇన్‌చార్జ్‌ రాఘవరెడ్డి, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుడు వెంకటరమణయ్య, బాలల రక్షణ విభాగం అధికారి శారద  పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top