నడిరోడ్డుపై ప్రసవం  

Delivery on the road - Sakshi

 రాయగడ ఒరిస్సా : రాయగడ జిల్లాలో ప్రత్యేకించి కల్యాణసింగుపురం సమితిలో కొద్దిరోజులుగా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలకు సరైన వైద్యం అందక  నడిరోడ్డు, చెట్లపొదల్లో ప్రసవిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.  కల్యాణసింగుపురం సమితిలోని పర్సలి గ్రామపంచాయతీ తుమకసిలా గ్రామానికి చెందిన డొంగ్రియ ఆదివాసీ మహిళ గురువారం నడిరోడ్డుపై ప్రసవించడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన నిలయికడ్రకకు బుధవారం రాత్రి ప్రసవనొప్పులు రాగా కాలవైశాఖి కారణంగా భారీ గాలులు, వర్షం కురవడంతో తీసుకువెళ్లలేక పోయారు. గురువారం కల్యాణసింగుపురం ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించి 108, 102, బైక్‌ అంబులెన్స్‌లకు ఫోన్‌ చేసినప్పటికీ సరైన స్పందన లేకపోపోయింది.

ఆ సమయంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావడంతో  కుటుంబీకులు, భర్త సహకారంతో 10కిలోమీటర్ల దూరం తీసుకువెళ్తుండగా జమ్మగుడ చౌక్‌వద్ద నొప్పులు మరింత ఎక్కువ రావడంతో నువసాయి రోడ్డుపై ఆడపిల్లను ప్రసవించింది. ఈ విషయం బీడీఓకు తెలియడంతో తక్షణం ప్రత్యేక వాహనాన్ని పంపి తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్‌ చిన్మయి లెంక తెలియజేశారు. 

నిర్లక్ష్యంగా యంత్రాంగం

కల్యాణసింగుపురంలో ప్రతి నెలకు ఇద్దరు లేక ముగ్గురు మహిళలు సరైన వైద్య సహాయం లేక నడిరోడ్డుపై ప్రసవిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.  ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక ఆరోగ్యపథకాలు, వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం,  వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం జిల్లాలోని కల్యాణ సింగుపురం సమితిలో గ్రామీణ మహిళలకు సుఖప్రసవం కోసం  జననీ సురక్ష పథకం, 108 అంబులెన్సు, 102 అంబులెన్సుతో సహా బైక్‌ అంబులెన్సును ఏర్పాటు చేసినప్పటికీ గర్భిణులకు సకాలంలో సహాయం అందక నడిరోడ్డుపై ప్రసవిస్తుంటే ప్రభుత్వానికి తలవంపుగా భావించాలి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top