మరో షెల్టర్‌ హోం దారుణం..

Delhi Shelter Home Staff Abuse Girls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో షెల్టర్‌ హోం దారుణం చోటుచేసుకుంది. అక్కడ వసతి పొందుతున్న 22 మంది బాలికలపై నిర్వాహకులు అకృత్యాలకు దిగారు. వారితో నానా చాకిరీ చేయించడంతోపాటు క్రమశిక్షణ పేరుతో సున్నిత ప్రదేశాల్లో కారం చల్లి చిత్రహింసలకు గురిచేశారు. నైరుతి ఢిల్లీలోని ఓ ఎన్జీవోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ (డీసీడబ్ల్యూ) గురువారం సదరు షెల్టర్‌ హోంను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీసీడబ్ల్యూ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండడంతో నిర్వాహకుల ఆగడాలు తెలుసుకోవడం సులభమైంది.

అపరిశుభ్ర, అనాగరిక పరిస్థితులు గుడుపుతున్న బాలికల దుస్థితి తెలిసింది. బాలికలతో వంటపని, ఇంటిపని, పాకీ పని కూడా చేయిస్తున్నారు. మొండికేసిన పిల్లల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్నారు. షెల్టర్‌ హోంలో ఉన్న పిల్లలంతా 6 నుంచి 15 ఏళ్ల లోపు వారే. డీసీడబ్ల్యూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోం నిర్వాహకులపై పోక్సో, జువైనల్‌ చట్టాల కింద కేసులు నమోదు చేశామని ద్వారకా డీసీపీ ఆంటో ఆల్ఫోన్స్‌ తెలిపారు. తమని వేసవి, శీతకాల సెలవులకు కూడా పంపించరని పిల్లలు వాపోయారు. ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు కూడా సమాచారమిచ్చామనీ, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్టు డీసీడబ్ల్యూ వెల్లడిచింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top