నోరు విప్పారో ఖాతా ఖాళీ

Debit / credit card frauds - Sakshi

పెరిగిపోతున్న డెబిట్‌/క్రెడిట్‌ కార్డు మోసాలు

ఫోన్‌లోనే వివరాలన్నీ సేకరిస్తున్న కేటుగాళ్లు

అడిగిన సమాచారం చెప్పేస్తే అంతే..

గతేడాది మొత్తం 290 సైబర్‌ క్రైమ్‌ కేసులు

వాటిలో 80 ‘కార్డు’లకు సంబంధించినవే

జార్ఖండ్‌లోని జంతారా నుంచి ఎక్కువ కాల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘హలో.. మేం ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ క్రెడిట్‌/డెబిట్‌కార్డుల్ని తక్షణం అప్‌గ్రేడ్‌ చేయాలి. లేదంటే అవి బ్లాక్‌ అయిపోతాయి..’ ‘రిజర్వ్‌ బ్యాంకు తాజా ఆదేశాల ప్రకారం మీ కార్డుకు ఆధార్, పాన్‌కార్డుల్ని లింక్‌ చేయాల్సి ఉంది..’

..ఇలా ‘సీజన్‌’కు తగ్గట్టు మాట్లాడుతూ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులకు సంబంధించిన వివరాలతోపాటు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) తెలుసుకొని అందినకాడికి దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గతేడాది సిటీ సైబర్‌ క్రైం పోలీసులు 290 వరకు కేసులు నమోదు చేయగా.. వీటిలో కార్డు క్రైమ్‌కు సంబంధించినవే 80 దాకా ఉన్నాయి. మొత్తం 190 మంది సైబర్‌ నేరగాళ్లను పట్టుకోగా.. అందులో 39 మంది కార్డు కేటుగాళ్లే ఉన్నారు.

‘ఓటీపీ’ కేరాఫ్‌ జార్ఖండ్‌
ఆర్థిక నష్టానికి సంబంధించిన సైబర్‌ నేరాల్లో అత్యధికం క్రెడిట్‌/డెబిట్‌ కార్డులకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ తరహా నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జంతారా ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలోని ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్‌ నేరాలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్‌ సెంటర్లలో పని చేసి వచ్చిన జంతారా యువత.. ఇప్పుడు తామే సొంతంగా ‘కాల్‌ సెంటర్లను’ ఏర్పాటు చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతోంది. బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు వాటి కాల్‌సెంటర్ల ద్వారా కస్టమర్ల డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల డేటా ఈ సైబర్‌ నేరగాళ్లకు చేరుతోందని తెలుస్తోంది.

డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో వీరు చెబుతున్నారు. తర్వాత ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకొని వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. అందుకు వీరు బోగస్‌ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. ఇటీవల అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్‌’ తరహా యాప్స్‌ ఉంటున్నాయి. దీంతో బోగస్‌ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జంతారా యువత ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్‌ హెడ్‌–ఆఫీస్‌’పేరుతో రిజిస్టర్‌ చేయించేస్తున్నారు.

దీంతో ఆ నంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్‌ చేసుకునే వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగుతోంది. సేకరించిన సమాచారంతో కొన్ని సందర్భాల్లో వీరు క్లోన్డ్‌ క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు కూడా తయారు చేస్తున్నారు. జంతారా ప్రాంతంలో ఒక్కో సెల్‌టవర్‌ పరిధి దాదాపు 25 కి.మీ. వరకు విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.

రోజూ ఐదారుగురు..
ఈ తరహా సైబర్‌ నేరాల బారినపడి ప్రతిరోజూ ఐదారుగురు బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే రూ.50 వేల కంటే ఎక్కువ నష్టపోయిన సందర్భాల్లో మాత్రమే అధికారులు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటికే కరపత్రాలు, పోస్టర్లు వినియోగిస్తుండగా... త్వరలో షార్ట్‌ఫిల్మ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అప్రమత్తతతోనే చెక్‌..
సైబర్‌ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, సొమ్ము రికవరీ చేయడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ చెప్పవచ్చు. ఆధార్‌ లింకు లేదా అప్‌గ్రేడ్‌ కోసం బ్యాంకు ఫోన్‌ చేయదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకుకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్‌ ద్వారా రహస్య వివరాలు అడగవు.
– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top