కన్నతల్లిపై కూతురు కక్ష.. 20వేల సుపారీ!

వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందని దారుణం
సాక్షి, నల్లగొండ: తల్లిపై కూతుర్లు కక్షగట్టిన అమానవీయ సంఘటన ఇది. హైదరాబాద్ లో టీనేజీ యువతి తల్లిని హత్య చేసిన ఘటన తర్వాత.. అలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఇద్దరు కూతుర్లు తల్లిని హత్య చేసిన ఘటనలో మానవ సంబంధాలు పక్కదారిపట్టిన తీరు ఆందోళనకు గురి చేస్తుంది.
నల్లగొండ రూరల్ మండలం అప్పాజీపేటలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఇది. అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్యమ్మ వయసు 55 ఏళ్లు. ఆమెకు ఆండాలు, రుద్రమ్మ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. సత్యమ్మకు అదే గ్రామానికి చెందిన కూరాకుల యాదయ్యతో వివాహేతర సంబంధం ఉంది. అయినా సరే యాదయ్య డబ్బిస్తానని ఆశపెట్టడంతో తన చిన్న కూతురిని కూడా రుద్రమ్మను అతడి వద్దకు పంపేది. యాదయ్య కారణంగా రుద్రమ్మ రెండుసార్లు గర్భందాల్చింది. దీంతో చివరికి రుద్రమ్మను యాదయ్యకే ఇచ్చి పెళ్లి చేసింది తల్లి సత్యమ్మ. యాదయ్య, రుద్రమ్మ దంపతులకు ఓ పాప పుట్టింది. అయినా సరే తన తల్లికీ.. భర్తకూ ఉన్న వివాహేతర సంబంధం కారణంగా తరచూ గొడవలు పడేవారు. భర్తతో మనస్పర్థలు తీవ్రం కావడంతో తల్లికీ, భర్తకూ దూరంగా కూతురుతో కలిసి రుద్రమ్మ చౌటుప్పల్లో విడిగా ఉంటోంది. రుద్రమ్మ కాపురానికి వచ్చేలా చెయ్యాలంటూ సత్యమ్మపై యాదయ్య ఒత్తిడి చేసేవాడు. అయితే తల్లి కారణంగానే తన జీవితం నాశనమైందనీ, మళ్లీ ఇప్పుడు కాపురానికి వెళ్లమంటోందని రుద్రమ్మ ఆగ్రహం పెంచుకుంది. పెళ్లయిన పెద్ద కూతురు ఆండాలుకు కూడా మూడేళ్లుగా తల్లితో మాటల్లేవు. తల్లి తీరుపై కూతుళ్లిద్దరూ ఆగ్రహంతో ఒక్కటయ్యారు.
సత్యమ్మను అంతం చేసేందుకు పథకం వేశారు. చండూరు మండలం నెర్మటకు చెందిన జంగయ్యతో 20వేలకు సుపారీ మాట్లాడుకున్నారు. అక్టోబరు 31న చౌటుప్పల్ నుంచి జంగయ్య, రుద్రమ్మ బైక్పై అప్పాజీపేటలోని సత్యమ్మ ఇంటికి వచ్చారు. సత్యమ్మను కిందపడేసి కదలకుండా జంగయ్య పట్టుకోగా... ఆమె గొంతుపై రుద్రమ్మ కాలితో తొక్కి హత్య చేసింది. జంగయ్య కూడా బలంగా తొక్కడంతో సత్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న 30వేల నగదు, 3 తులాల బంగా రం, 50తులాల వెండి ఆభరణాలతో ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంతో భయపడిన ఇద్దరు కుమార్తెలు.. తల్లిని తామే చంపామనీ, రక్షించాలని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లారు. ఆయనే వాళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళతో పాటు జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి